
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లా ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ పద్ధతిలో కంపెనీ నికర లాభం రూ.1,298 కోట్లకు చేరింది. ఏడాది లెక్కన 10 శాతం పెరిగింది. గత జూన్ క్వార్టర్లో రూ.రూ.1,178 కోట్ల లాభం వచ్చింది. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌లలో బలమైన అమ్మకాల వల్ల లాభం పెరిగింది. జూన్ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.6,957 కోట్లకు పెరిగిందని, గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.6,694 కోట్లుగా ఉందని సిప్లా ఒక ప్రకటనలో తెలిపింది.
సిప్లా ఎండి గ్లోబల్ సీఈఓ ఉమాంగ్ వోహ్రా మాట్లాడుతూ, కంపెనీ వన్-ఇండియా వ్యాపారం ఈ క్వార్టర్లో ఏడాది లెక్కన 6 శాతం వృద్ధి చెందిందని అన్నారు. బ్రాండెడ్ ప్రిస్క్రిప్షన్ వ్యాపారంలో కీలక చికిత్సలు మార్కెట్‌ను పెంచాయని, ట్రేడ్ జెనరిక్స్ వ్యాపారం తిరిగి గాడిలో పడిందని అన్నారు. వినియోగదారుల ఆరోగ్య వ్యాపారం, యాంకర్ బ్రాండ్లు రాణించాయని వోహ్రా పేర్కొన్నారు. ఈసారి భారతీయ మార్కెట్లో సిప్లా అమ్మకాలు రూ.3,070 కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.2,898 కోట్ల విలువైన అమ్మకాలను కంపెనీ సాధించింది.