ఎంత చదివినా గుర్తుండట్లే!. ఒత్తిడిలో ఇంటర్ స్టూడెంట్స్

ఎంత చదివినా గుర్తుండట్లే!. ఒత్తిడిలో ఇంటర్ స్టూడెంట్స్
  • ఇంటర్​ స్టూడెంట్స్​ నుంచి సైకాలజిస్టులకు అర్ధరాత్రి వరకు ఫోన్‌‌ కాల్స్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల నుంచి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో బోర్డు ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సెల్ కు స్టూడెంట్ల నుంచి కుప్పలు తెప్పలుగా కాల్స్ వస్తున్నాయి. ఉదయం మూడున్నర, నాలుగు గంటలకు మొదలవుతున్న కాల్స్ అర్ధరాత్రి 11 గంటల వరకు వస్తూనే ఉంటున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. బోర్డు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలి ఇలా అనేక సందేహాలతో ఉంటున్నారని అంటున్నారు. బోర్డు ఇటీవల కౌన్సిలింగ్ సెల్​ప్రారంభించిందని, అప్పటి నుంచి డైలీ100 నుంచి120 వరకు కాల్స్ వస్తున్నాయని క్లినికల్ సైకాలజిస్ట్ డా.అనిత ఆరే తెలిపారు. చాలావరకు కాల్స్​చేస్తున్న స్టూడెంట్స్ చదివింది గుర్తుండట్లేదని చెబుతున్నారన్నారు. స్టూడెంట్స్ లోని ఇలాంటి సందేహాలను ఫోన్ కాల్స్ ద్వారా తీర్చడంతోపాటు ఎగ్జామ్​కి ముందు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎగ్జామ్​హాల్​లో ఎలా ఉండాలి అనే విషయాలతో ఇంటర్​బోర్డు వీడియోల రూపంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్లాన్​చేస్తోంది. టీశాట్, యూట్యూబ్, ఆన్​లైన్ పోర్టల్స్ లో అప్ లోడ్ చేయనుంది.

ఎట్లుండాలో చెప్తున్నరు..

ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సెల్​లో ఆరుగురు క్లినికల్ సైకాలజిస్ట్‌‌లు, ఒక సైక్రియాట్రిస్ట్ ఉన్నారు. ఇటీవలే బోర్డ్ వీరి ఫోన్​నంబర్లను విడుదల చేసింది. ఈ నంబర్లకు స్టూడెంట్ల నుంచి డైలీ కాల్స్​వస్తూనే ఉన్నాయి. ‘ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?. చదివింది అస్సలు గుర్తుండటం లేదు!. ఒక క్వశ్చన్​కు ఆన్సర్​రాస్తున్న టైంలో మరో ఆన్సర్ గుర్తొస్తుంది!. చదివిన క్వశ్చన్స్​ఎగ్జామ్​లో రాకపోతే ఎలా?.’ ఇలా అనేక భయాలు, డౌట్లతో స్టూడెంట్లు కాల్​చేస్తున్నారు. సబ్జెక్టును కొన్ని భాగాలుగా విభజించి అరగంట చొప్పున సమయం కేటాయించి చదవాలని కౌన్సిలర్లు సూచిస్తున్నారు. టైం టేబుల్ ప్రకారం సబ్జెక్టుకు టైమ్​కేటాయించుకుని చదవాలని చెప్తున్నారు. పరీక్ష ముందు రోజు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా లెక్చరర్లు, పేరెంట్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని కౌన్సిలర్లు చెబుతున్నారు.

ప్రాంక్ కాల్స్ కూడా వస్తున్నయ్

ప్రస్తుతం చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్​విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు బోర్డు ఎగ్జామ్స్ రాయలేదని, అవి ఎలా ఉంటాయో అని కంగారు పడుతున్నారు. టెన్షన్ తో చదివింది మర్చిపోతున్నామని చెప్తున్నారు. భయపడకుండా సబ్జెక్టుకు కొంత సమయం కేటాయిస్తూ ఎలా చదవాలో చెబుతున్నాం. ఎగ్జామ్ హాల్ లో ఎలా ఉండాలో, రాయాలో వివరిస్తున్నాం. డైలీ వంద కాల్స్​ దాకా వస్తున్నాయి. 
‌‌‌‌-  డా.అనిత ఆరే,
క్లినికల్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ​సెల్