
- టన్ను ముడి ఇనుముకు 300 కోట్లు లాభాలు వస్తాయని నమ్మించాడు
- కర్నాటకకు చెందిన ఎకోర్ ఐరన్ ఓర్ కంపెనీతో లావాదేవీలు
- అఖండ్ ఎంటర్‌ప్రైజెస్‌ను మోసగించినట్లు ఫిర్యాదు
- రూ.6 కోట్ల చీటింగ్ ఆరోపణలపై సీసీఎస్‌లో శ్రవణ్ రావుతో పాటు భార్య స్వాతిరావుపై కేసు
- విచారణ తర్వాత శ్రవణ్‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌రావు తాజాగా మరో కేసులో అరెస్టయ్యాడు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అఖండ్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు శ్రవణ్‌రావు 6 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు..విచారణ నిమిత్తం హాజరుకావాల్సిందిగా శ్రవణ్‌రావుకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం శ్రవణ్‌రావు సీసీఎస్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం, ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి నివాసంలో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు.
కర్నాటకలోని ఐరన్ ఓర్ కంపెనీ ఏజెంట్‌గా కమీషన్ దందా
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మిథిలానగర్ కాలనీకి చెందిన అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ 2008 ఆగస్టు నుంచి వివిధ ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో 2022 జూన్‌లో శ్రవణ్‌రావు.. ఆ కంపెనీ ఎండీ ఆకర్ష్ కృష్ణను కలిశాడు. తాను ఇర్రిథమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రంలోని సండూర్, బల్లారిలోని ఎకోర్ ఇండస్ట్రీస్ ఐరన్ ఓర్ కంపెనీకి ఏజెంట్‌గా వ్యహరిస్తున్నానని చెప్పాడు.
ముడి ఇనుము సరఫరా చేస్తే టన్నుకు రూ.300 కోట్లు లాభం వస్తుందని నమ్మించాడు. ఇలా వచ్చిన లాభంలో కమీషన్ తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ మేరకు అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి ఎకోర్ ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతాకు 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబరు వరకు విడతలవారీగా రూ.23 కోట్లు లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రతినిధులు శ్రవణ్‌రావుకు అందించారు. కానీ ఇందుకు సంబంధించి ఎకోర్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి ఇన్‌వాయిస్‌లు సదరు కంపెనీకి చేరలేదు.
రూ..300 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు ఇన్‌వాయిస్‌లు
ఎకోర్ కంపెనీ ఏజెంట్‌గా ఆ బాధ్యతలను శ్రవణ్‌రావు చేపట్టాడు. ఎకోర్ ఇండస్ట్రీస్ పేరుతో తన కంపెనీ ఇర్రిథమ్ ఎనర్జీ అకౌంటెంట్ నగేశ్ పేరుపై ఇన్‌వాయిస్‌లు ఈ మెయిల్ చేశారు. అఖండ్ ఇన్‌ఫ్రాటెక్‌కు ఏజెంట్‌గా కూడా మరికొన్ని ఇన్‌వాయిస్‌లు జనరేట్ చేశాడు. ఇలా టన్నుకు దాదాపు రూ.300 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు ఇన్‌వాయిస్‌లు రూపొందించారు. ఎకోర్ సంస్థ నుంచి అఖండ్ ఇన్‌ఫ్రాటెక్‌కు రావాల్సిన ఇన్‌వాయిస్‌లు తమ కంపెనీ పేరున లేకపోవడంతో ఆకర్ష్ కృష్ణకు అనుమానం వచ్చింది. శ్రవణ్‌రావు సహా ఎకోర్ సంస్థ గురించి ఆరా తీశాడు.
2023లో ఎకోర్ ఇండస్ట్రీస్ హోల్ టైమ్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డిని కలిసి ఈ విషయంపై మాట్లాడాడు. డబ్బులు చెల్లింపు విషయంలో శ్రవణ్‌రావు మాత్రమే బాధ్యత తీసుకున్నాడని, అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ తన సొంత కంపెనీగా చెప్పుకుంటూ ఇన్‌వాయిస్‌లు జనరేట్ చేసినట్టు ఆకర్ష్ కృష్ణ గుర్తించాడు. ఇలా ఐరన్ ఓర్ పేరుతో శ్రవణ్‌రావు, అతని భార్య స్వాతిరావు, ఎకోర్ సంస్థ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డితో కలిసి రూ.6.58 కోట్లు నష్టం కలిగించినట్టు బాధితుడు ఆకర్ష్ కృష్ణ గత నెల 25న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం శ్రవణ్‌రావును విచారించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.