ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు సమయం కావాలని సిట్ను కోరిన బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు సమయం కావాలని సిట్ను కోరిన బండి సంజయ్

ఫోన్ ట్యాంపింగ్ కేసు విచారణను వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో నిందితులను విచారిస్తూనే.. బాధితుల నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకుంటున్నారు సిట్ అధికారులు. అయితే ఈ కేసులో విచారణకు వచ్చి సాక్ష్యాధారాలు ఉంటే సమర్పించాలని ఇప్పటికే  కేంద్ర మంత్రి మండి సంజయ్ ను సిట్ కోరింది. జులై 24 న విచారణకు రావాలని గతంలో నోటీసులు జారీ చేసింది. జులై 24న  విచారణకు హాజరై.. సహకరిస్తానని బండి సంజయ్ తెలిపారు. 

అయితే విచారణకు ఒక రోజే సమయం ఉండటంతో  హాజరయ్యేందుకు సమయం కావాలని సిట్ ను కోరారు బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాలు ఉన్న సమయంలో సిట్ విచారణకు రాలేనని తెలిపారు. 28న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు తెలిపారు. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్కు చేరిందని ఈ పరిణామంతో స్పష్టమైంది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. 

 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్తో పాటు ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

►ALSO READ | విచారణకు పిలిచి వేధిస్తుండ్రు: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్

బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఆయన వద్దకే వచ్చి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బండి సంజయ్ సూచన  మేరకు హైదరాబాద్ లోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గ్రుహంలో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారు. బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. 

ఈ మేరకు వీరంతా అదే రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందున మరికొంత సమయం కావాలని సిట్ ను బండిసంజయ్ కోరడం గమనార్హం.