ప్రభుత్వ ల్యాప్టాప్ తీసుకెళ్లారు.. ఎలక్ట్రానిక్ డివైజ్లు ఫార్మాట్ చేశారు

 ప్రభుత్వ ల్యాప్టాప్ తీసుకెళ్లారు.. ఎలక్ట్రానిక్ డివైజ్లు ఫార్మాట్ చేశారు
  • ఎంక్వైరీకి ప్రభాకర్​రావు సహకరించడం లేదు
  •  సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ప్రభుత్వ ల్యాప్ టాప్ ను నిందితుడు ప్రభాకర్ రావు తీసుకెళ్లారని, ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా ఫార్మాట్ చేశారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. విచారణకు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదని మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌‌ఐబీ కేంద్రంగా ఫోన్‌‌ అక్రమ ట్యాపింగ్‌‌కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్‌‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌‌రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, తాను భారతదేశానికి తిరిగివస్తానని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు తిరస్కరించింది. 

హైకోర్టు తీర్పును మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మే 29న ప్రభాకర్ రావుకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. అమెరికా నుంచి భారత్​కు తిరిగి వచ్చి సిట్ దర్యాప్తునకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ మరోసారి బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ వాదనలను వినిపిస్తూ... కోర్టు ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చిన ప్రభాకర్ ఇప్పటి వరకు 10 సార్లు విచారణకు హాజరయ్యారని ధర్మాసనానికి నివేదించారు. 

ఈ స్టేట్మెంట్లపై అధికారులు డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా హాజరైన ప్రభుత్వం తరఫు సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ్ లూత్రా అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపారు. స్టేటస్ రిపోర్టు ఇప్పటికే దాఖలు చేశామని, అందులో అన్ని అంశాలను స్పష్టంగా పొందుపరిచినట్లు వివరించారు. ఒకసారి ఆ రిపోర్ట్ ను పరిశీలించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని జస్టిస్ నాగరత్న.. పిటిషనర్ విచారణకు సహకరిస్తున్నారు కదా? అని ప్రశ్నించారు. అందువల్ల గతంలో జారీ చేసిన మధ్యంతర రక్షణను పొడిగించింది. 

విచారణకు సహకరించడం లేదు

అయితే.. సిద్ధార్థ్ లూత్రా మాత్రం స్టేటస్ రిపోర్ట్ చూడాలని బెంచ్ ను కోరారు. వేరే కేసులు ఉన్నందున.. కనీసం నేరుగా వచ్చి వాదనలు వినిపించేందుకు కేసు విచారణను కాసేపు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు బెంచ్ నిరాకరించింది. మరోవైపు ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై వాదనలు వినిపించారు. సాక్షాలు లేకుండా ప్రభాకర్ రావు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మాట్ చేశారని తెలిపారు. ఈ వాదనలపై స్పందించిన జస్టిస్ నాగరత్న.. డిలీట్ చేసిన డేటాను ఎక్స్ ట్రాక్ట్ (తిరిగి సేకరించే) చేసేందుకు టెక్నాలజీ ఉందిగా అని ప్రశ్నించారు. ఆ డేటాను ఎలా తీయాలో ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలకు తెలుసునన్నారు. ఇందుకు మెహతా బదులిస్తూ.. అదే విధంగా వాటిని తిరిగి సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 

‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదంతా ప్రభుత్వం మారడం వల్ల వచ్చిన అంశం’అని కీలక కామెంట్లు చేశారు. అయితే.. ఆధారాల సేకరణకు ఆస్కారం లేకపోతే.. ఇందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పును ఇచ్చిందని తుషార్ మెహతా వాదించే ప్రయత్నం చేశారు. ఇందుకు నిరాకరించిన జస్టిస్ నాగరత్న.. నెల రోజులకు కేసు విచారణ వాయిదా వేశామని, అప్పుడు అన్ని అంశాలపై వాదనలు వింటామని స్పష్టం చేశారు.