ఫోన్ ట్యాపింగ్ నెట్ వర్క్ : నల్లగొండ జిల్లాలో బైఎలక్షన్స్ కోసం నిఘా

ఫోన్ ట్యాపింగ్ నెట్ వర్క్ : నల్లగొండ జిల్లాలో బైఎలక్షన్స్ కోసం నిఘా

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ​ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్​కే పరిమితం కాలేదు. ఎస్​ఐబీ  మాజీ చీఫ్ ​ప్రభాకర్​రావు అండ్​ టీమ్​ నెట్​వర్క్​ జిల్లాలకూ విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు,  ప్రత్యర్థి పార్టీల డబ్బును కట్టడి చేసేందుకు, ఆఖరుకు మైహోమ్​ లాంటి సంస్థల కోసం కూడా ఫోన్ ​ట్యాపింగ్​ చేసిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిందే తడువు వాళ్ల ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు, సామాన్యుల ఫోన్లనూ ట్యాప్​చేసి, ఆ సమాచారాన్ని అందించేవారని తెలుస్తున్నది. 

 ఎస్ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావు గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసిన టైంలో ప్రణీత్​రావు నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని పలు స్టేషన్లలో ఇన్​స్పెక్టర్​గా ఉన్నారు. ప్రణీ త్​రావు, ప్రభాకర్​రావు ది ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కోరుకున్న చోటుకు పోస్టింగ్ ​ఆర్డర్స్​ వచ్చేవి. భూపాల్​ పల్లి ఏఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు సొంత జిల్లా సూర్యాపేట. ఈ ముగ్గురితోపాటు ఇప్పటికే అరెస్ట్​ చేసిన తిరపతన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వీరిని అడ్డుపెట్టుకొని ప్రభాకర్​ రావు  జిల్లాలో ఇసుక, లిక్కర్​, ల్యాండ్​ సెటిల్​మెంట్లు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇక వీరంతా ఎస్ఐబీలో తిష్టవేశాక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్​ బిగ్​షాట్స్​ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​ రెడ్డి, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లను ట్యాప్​చేశారనే ఆరోపణలున్నాయి.

హుజూర్​నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ నాయకుడు ఎటువైపు పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ హైకమాండ్​తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలకు​చేర వేసినట్టు తెలుస్తున్నది. పార్టీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తెలిసిన మరుక్షణమే ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడంతో నేతలు హడలిపోయేవారని సమాచారం. దీనికితోడు ప్రత్యర్థుల డబ్బు పంపిణీ కాకుండా ఎక్కడికక్కడ పట్టుకోవడంతో బీఆర్ఎస్​ గెలుపు సునాయాసమైందని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరిగింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల ముందు సుఖేందర్​రెడ్డి ప్రతి కదలిక, ఆయన మాట్లాడే ప్రతి మాట మాజీ మంత్రి జగదీశ్​రెడ్డికి, అక్కడి నుంచి హైకమాండ్​కు చేరడం వల్లే సుఖేందర్​రెడ్డి కొడుకు అమిత్​రెడ్డికి టికెట్​ఇవ్వకుండా పక్కన పెట్టినట్టు సమాచారం.