ఫోన్ ట్యాపింగ్ నెట్ వర్క్ : మై హోం కోసం మేళ్లచెరువులో మూడు రోజులు తిష్ఠ

ఫోన్ ట్యాపింగ్ నెట్ వర్క్ : మై హోం కోసం మేళ్లచెరువులో మూడు రోజులు తిష్ఠ

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ​ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్​కే పరిమితం కాలేదు. ఎస్​ఐబీ  మాజీ చీఫ్ ​ప్రభాకర్​రావు అండ్​ టీమ్​ నెట్​వర్క్​ జిల్లాలకూ విస్తరించిందనేందుకు కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల వ్యూహాలు తెలుసుకునేందుకు, సొంత పార్టీ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు,  ప్రత్యర్థి పార్టీల డబ్బును కట్టడి చేసేందుకు, ఆఖరుకు మైహోమ్​ లాంటి సంస్థల కోసం కూడా ఫోన్ ​ట్యాపింగ్​ చేసిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అప్పటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిందే తడువు వాళ్ల ప్రత్యర్థులు, రియల్టర్లు, వ్యాపారులు, సామాన్యుల ఫోన్లనూ ట్యాప్​చేసి, ఆ సమాచారాన్ని అందించేవారని తెలుస్తున్నది. 

మైహోమ్ కోసం  మేళ్లచెరువులో మూడు రోజులు తిష్ట

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మై హోమ్స్​ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రణీత్ రావు టీమ్  పనిచేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుడు ఆగస్టు 31న మై హోమ్స్​ సిమెంట్ పరిశ్రమ నాలుగో ప్లాంట్ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  ప్లాంట్​ విస్తరణను వ్యతిరేకిస్తున్నవాళ్లను ముందుగానే గుర్తించి అరెస్ట్ చేయడంలో హైదరాబాద్​ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మైహోమ్స్​ అధినేత రామేశ్వరరావు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అత్యంత సమీప బంధువులు. 

ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు టీంలో ఉన్న డీఎస్పీలు తిరుపతన్న, శ్రీనివాస్​నాయుడు ప్రజాభిప్రాయ సేకరణకు మూడు రోజుల ముందుగానే మేళ్లచెరువులో మకాం వేసి పలువురు ఆందోళనకారుల ఫోన్లను ట్యాప్​ చేసినట్టు తెలుస్తున్నది. ట్యాపింగ్ ద్వారా కీలకమైన ఆందోళనకారులను గుర్తించిన పోలీసులు.. రాత్రికిరాత్రే అరెస్ట్​లు చేసి, ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా జరిగేలా చూశారని అప్పట్లో ప్రచారం జరిగింది.

 నాటి జిల్లా ఎస్పీకి  సమాచారం లేకుండా చేసిన ఈ ఆపరేషన్​ అప్పట్లో పోలీస్​శాఖలో కలకలం రేపింది.  హైదరాబాద్ డీఎస్పీ కేడర్ అధికారులకు సూర్యాపేట జిల్లాలో ఎందుకు డ్యూటీ వేశారని స్థానిక అడ్వొకేట్​ నాగార్జున ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా తమకు ఆ సంగతే తెలియదని సూర్యాపేట జిల్లా పోలీసులు సమాధానం ఇవ్వడం గమనార్హం.