‘ఫ్రాగ్‌‌మైట్స్‌‌ కర్క’తో  స్ట్రా

‘ఫ్రాగ్‌‌మైట్స్‌‌ కర్క’తో  స్ట్రా

మన చుట్టూ ఉన్న ఎన్నో ఔషధ మొక్కల్ని పిచ్చి మొక్కలు అనుకొని వాటిగురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు. రోడ్డు పక్కన, పొలాల గట్టున పెరిగేవాటిని పీకేయడమో, కాల్చేయడమో చేస్తుంటారు చాలామంది. కానీ, ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుంటే వాటిని మెడిసినల్ ప్లాంట్స్‌‌గా వాడుకోవచ్చు అని చెప్తుంది పీహెచ్‌‌డీ రీసెర్చర్‌‌‌‌ డాక్టర్‌‌ దేవసేన.  
కోయంబత్తూర్‌‌‌‌కు చెందిన దేవసేన, తన పీహెచ్‌‌డీ రీసెర్చ్‌‌‌‌లో భాగంగా గడ్డి (వెదురు) జాతి మొక్క అయిన ‘ఫ్రాగ్‌‌మైట్స్‌‌ కర్క’తో  స్ట్రా తయారుచేసింది. ఈ మొక్కను వాడుక భాషలో ఈల కర్ర లేదా నాగసరము– పీపలు అని పిలుస్తారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ స్ట్రాలని రీ యూజ్‌‌ కూడా చేసుకోవచ్చు అంటోందామె. 

అందుకే మొదలుపెట్టా..

దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌ వాడటంవల్ల పొల్యూషన్ పెరిగిపోతుందని, వాటిని బ్యాన్ చేసింది ప్రభుత్వం. స్ట్రాలు కూడా సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌తో తయారవుతాయి. వాటివల్ల కూడా పొల్యూషన్ జరుగుతుంది. అయినా వాటి వాడకం తగ్గించే ఉపాయాల గురించి ఆలోచించట్లేదు. కూల్‌‌ డ్రింక్స్‌‌, జ్యూస్‌‌, కొబ్బరి బోండాం తాగేందుకని రోజూ చాలారకాలుగా స్ట్రాలు వాడుతుంటారు. వాటిని రీ సైకిల్‌‌ చేయకుండా డంప్‌‌ యార్డ్‌‌లో పడేస్తుంటారు. స్ట్రాల వేస్టేజ్ తగ్గించాలని ‘ఎకోవైజ్‌‌ సొల్యూషన్‌‌’ పేరుతో కొత్తరకం స్ట్రాలు తయారుచేస్తోంది. రోజూ పొలాలు, చెరువు గట్ల మీద దొరికే ఫ్రాగ్‌‌మైట్స్‌‌ కర్క తీసుకొచ్చి దేవసేనకి అమ్ముతారు రైతులు.

 

మెషిన్ సాయంతో కత్తిరించి ఉప్పు, పసుపు నీళ్లలో కడిగి ఒక రోజంతా ఆరబెడుతుంది. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. ‘ఈ మొక్కల్లో శరీరానికి మేలు కలిగించే ఔషధ గుణాలున్నాయి. ఈ స్ట్రాల్లో పోసిన మురికి నీళ్లని అరవై శాతం వరకు శుభ్రం చేసి మంచి నీళ్లు ఇస్తాయ’ని రీసెర్చ్‌‌లో కనిపెట్టింది దేవసేన. ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ స్ట్రాలు ప్యాకెట్‌‌కి ఐదు  చొప్పున యాభై రూపాయలకి అమ్ముతుంది. స్ట్రా వాడిన తరువాత శుభ్రం చేయడానికి ప్యాకెట్‌‌లో ఒక బ్రష్‌‌ కూడా ఉంటుంది. ఒక స్ట్రాని సంవత్సరం పాటు శుభ్రం చేసి వాడుకోవచ్చు.  ‘ఈ భూమ్మీద ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కనిపెడతా. వాటితో కావాల్సిన వస్తువులు తయారు చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తా’ అంటోంది దేవసేన.