హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలోని నాలాను ఆక్రమించి నిర్మిస్తున్న వెర్టెక్స్ కింగ్‌స్టన్ పార్క్ ప్రాజెక్టు పనులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. నల్లగండ్లలోని నాలాను మెస్సర్స్ వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆక్రమించిందనే పిల్‌కు నెంబర్ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం తోసిపుచ్చింది.
నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, నిర్మాణాలు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, అనధికార నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు నాలాను పూర్వస్థితికి తీసుకువచ్చేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ జె. శంకర్ మరొకరు పిల్ దాఖలు చేశారు.
