డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిల్.. 3 వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లుకు ఆదేశం

డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిల్.. 3 వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లుకు ఆదేశం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్) దాఖ‌లైంది. ఈ పిల్‌పై గురువారం నాయ్య‌స్థానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్‌తో పాటు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏజీ వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు పూర్తి వివ‌రాల‌తో మూడు వారాల్లో అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన త‌ర్వాత త‌దుప‌రి వాద‌న‌ల‌ను వింటామ‌ని స్ప‌ష్టం చేస్తూ విచార‌ణ‌ను వాయిదా వేసింది. రాష్ట్రంలో రోజు రోజుకీ క‌రోనా కేసుల భారీగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో విద్యార్థుల క్షేమం దృష్ట్యా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి యూనియ‌న్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఈ పిల్‌ను దాఖ‌లు చేశారు. దీనిని హైకోర్టు గురువారం విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌ల‌ను వినిపిస్తూ యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు ఏజీ. యూజీసీ ఆదేశాల ప్ర‌కారం ఫైన‌లియ‌ర్ విద్యార్థుల ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి అని, వాటిని ర‌ద్దు చేయ‌డం కుద‌ర‌ద‌ని తెలిపారు. పరీక్షల తేదీలను రెండు, మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామని చెప్పారు ఏజీ.

యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు సూచ‌న‌లు మాత్ర‌మేన‌న్న పిటిష‌న్

హైకోర్టు ధ‌ర్మాస‌నానం ఎదుట పిటిష‌న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ దామోద‌ర్ రెడ్డి వాద‌న‌ల‌ను వినిపిస్తూ యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు కేవ‌లం సూచ‌న‌లేన‌ని చెప్పారు. డిగ్రీ, పీజీ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించకుండా ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు ఈ ర‌కంగానే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయ‌ని కోర్టుకు వివ‌రించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌స్థానం మూడు వారాల త‌ర్వాత పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖలు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.