ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె

ఐదెకరాలలోపు ఉంటెనే రైతుబంధు ఇయ్యాలె

హైదరాబాద్, వెలుగు: ఐదు ఎకరాలలోపున్న రైతులకే రైతుబంధు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్​ దాఖలైంది. ఎకరాకు రూ.5 వేల సాయాన్ని ఏటా రెండుసార్లు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, భూమి పరిమితి విధించకపోవడాన్ని సవాల్​ చేస్తూ హైదరాబాద్​కు చెందిన టి. నందకిషోర్​ అనే లాయర్​ పిల్​ వేశారు. ఐదు ఎకరాల కన్నా ఎక్కువున్న వారికి రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కువ భూమి ఉన్న రైతులు తమ పొలాన్ని కౌలుకు ఇచ్చేస్తున్నారని, అయితే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని పిటిషనర్​ తరఫు లాయర్​ వాదించారు. పెట్టుబడి పెట్టలేని వారికి సాయం అందిస్తే మంచిదేనని, కానీ, భూస్వాములకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటని అన్నారు. పిటిషనర్​ వాదనలను విన్న చీఫ్​ జస్టిస్​ సతీశ్​చంద్ర శర్మ, జస్టిస్​ అభినంద్​ కుమార్​ షావిలిల డివిజన్​ బెంచ్​.. సీఎస్​తో పాటు రెవెన్యూ, ఫైనాన్స్​, వ్యవసాయ శాఖ కమిషనర్​లకు నోటీసులిచ్చింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.