
హైదరాబాద్, వెలుగు: మంథని మధుకర్ కుటుంబానికి న్యాయం ఇంకెప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ప్రశ్నించారు. 2017లో మధుకర్ హత్య జరిగితే ఇంత వరకు నిందితులకు శిక్ష పడలేదని తెలిపారు. శుక్రవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ అండతో మంథని మధుకర్ హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని సుధాకర్ ఆరోపించారు.
ఈ కేసులో ఫోరెన్సిక్, డాక్టర్ రిపోర్టులు వెలుగులోకి రాకుండా చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశించినా పోలీసులు కౌంటర్ ఎందుకు వేయట్లేదని ప్రశ్నించారు. మధుకర్ ది హత్యేనని నివేదికలు చెబుతున్నా ఎందుకు మర్డర్ కేసు నమోదు చేయట్లేదని నిలదీశారు. ఒక దళితుడిని మర్మాంగం కోసి హత్య చేస్తే ఏడేండ్లయినా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మంథని మధుకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మాల మహానాడు అండగా ఉంటుందని, అందరూ మరో పోరాటానికి కలిసి రావాలని పిలుపిచ్చారు.