ఐఎంజీబీ భూములపై హైకోర్టులో పిల్స్

ఐఎంజీబీ భూములపై హైకోర్టులో పిల్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఎకరం ధర రూ.50 వేలు చొప్పున 855 ఎకరాలను క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ–భరత అనే బోగస్‌‌ సంస్థకు ఇవ్వడంపై దాఖలైన రెండు పిల్స్‌‌ను విచారించాలని హైకోర్టును సీనియర్‌‌ లాయర్‌‌ గండ్ర మోహన్‌‌ రావు కోరారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వ చివరి రోజుల్లో భూముల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం జరగగా.. తర్వాత వచ్చిన వైఎస్‌‌ రాజశేఖర్‌‌ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ చర్యలను సవాల్‌‌ చేస్తూ ఐఎంజీబీ దాఖలు చేసిన పిటిషన్లను ఈనెల 7న హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది.

ఈ తీర్పును ఐఎంజీబీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో ఐఎంజీ భారతకు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌‌డీడ్‌‌.. ఇలా అన్ని అంశాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని టి.శ్రీరంగారావు, మరొకరు 2012లో పిల్స్‌‌ వేశారు. వీటిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ సుజోయ్‌‌పాల్‌‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. సుప్రీంకోర్టులో అప్పీల్‌‌ దాఖలు చేసినప్పటికీ పిల్స్‌‌పై విచారణ చేయవచ్చునని గండ్ర వాదించారు. ఐఎంజీబీ దాఖలు చేసిన అప్పీల్‌‌ పిటిషన్‌‌కు సుప్రీంకోర్టు నంబర్‌‌ కేటాయింపు కాలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దశలోనే ఉందని ఆ సంస్థ తరఫున సీనియర్‌‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణను ఏప్రిల్‌‌ మొదటి వారానికి వాయిదా వేసింది.