రేవంత్.. పార్టీ మారినందుకు ఎంత తీసుకున్నవ్ : పైలెట్ రోహిత్ రెడ్డి

రేవంత్.. పార్టీ మారినందుకు ఎంత తీసుకున్నవ్ : పైలెట్ రోహిత్ రెడ్డి

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఎంత లబ్ది చేకూరిందో చెప్పాలని పైలెట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారినందుకు టీడీపీ నుంచి లాభం చేకూరిందా లేక కాంగ్రెస్ నుంచ లబ్ది పొందాడో చెప్పాలని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పీఎస్ లో సీఎల్పీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన రోహిత్ రెడ్డి కాంగ్రెస్ చర్య హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ ఆరోపణలకు తలాతోకా లేదని అదే తాను పెట్టిన కేసులో ఆధారాలున్నాయని అన్నారు.  ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేకపోతే వాళ్ల లీగర్ టీం ఎందుకు కోర్టులో వాదిస్తోందని ప్రశ్నించారు.

బ్లాక్ మెయిలింగ్కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆయన గుణం తెలిసినందునే కేసీఆర్ అప్పట్లో జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరేటప్పుడు రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఇచ్చారని చెప్పారు. ఆయన నేతృత్వంలో జరిగిన రెండు ఎన్నికలల్లో పార్టీ పరిస్థితి గల్లంతైందని చెప్పారు. 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ను టీఆర్ఎస్ లో విలీనం చేశామని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసమే తప్ప, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారలేదని చెప్పారు. 12 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు.కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని అందరికీ అర్థమైందని, రానున్న రోజుల్లో ప్రజలే వారికి బుద్ది చెప్తారని అన్నారు.