పైలెట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలె - రఘునందన్ రావు

పైలెట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలె - రఘునందన్ రావు

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హత ఒకరకంగా.. 2018 ఎన్నికల అఫిడవిట్ లో మరో రకంగా చూపించారని ఆరోపించారు. దీనిపై భారత ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామన్నారు. 2009 అఫిడవిట్లో రోహిత్ రెడ్డి స్వీడన్ యూనివర్సిటీలో బీటెక్ ఎంఎస్ చదివినట్లు చూపించారన్నారు. 2018లో ఇంటర్మీడియట్ చదివినట్లు ఎందుకు చూపారో చెప్పాలన్నారు.  రాష్ట్ర ప్రజలను, తాండూరువాసులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మోసం చేశారని రఘనందన్ ఆరోపించారు.  

1200 మంది అమరులైన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని రఘునందన్ గుర్తు చేశారు. ఇతర పార్టీ నుంచి గెలిచి... టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే తెలంగాణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నందు, సింహయాజులతో ఎప్పటి నుంచి కాంటాక్ట్ ఉన్నారో రోహిత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వన్ పల్లి ప్రాజెక్టు రిసార్ట్, మొయినాబాద్ లో ఉన్న భూములు.. ఎంఐఎంతో కలిసి విద్యా వికాస్ సమితి పేరిట రూ. 200 కోట్ల ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలను రఘునందన్ ప్రస్తావించారు. వీటికి సంబంధించిన నోటీసులకు కూడా రోహిత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.