ఈడీ విచారణకు హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. తనను ఎందుకు పిలిచారో కూడా  తెలియదన్నారు. ఈడీ అధికారులు తనను ఎలాంటి వివరాలు అడిగినా చెబుతానని స్పష్టం చేశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. తనకు ఏ కేసులతోనూ సంబంధం లేదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంత సమయం కావాలని అడిగానని, అయితే.. ఈడీ అధికారులు కుదరదు చెప్పడంతో తాను విచారణకు వచ్చానని వెల్లడించారు. 

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అనంతరం విచారణకు రాలేనంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీకి లెటర్ పంపారు. ఈ నెల 25 వరకు విచారణకు రాలేనని లెటర్ లో స్పష్టం చేశారు. అయితే.. ఆయన రిక్వెస్ట్ ను ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించడంతో ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 

అంతకు ముందు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఉదయం ఈడీ విచారణకు వెళ్తున్నట్లు ప్రకటించిన పైలెట్ రోహిత్ రెడ్డి.. మణికొండలోని తన నివాసం నుంచి బయలుదేరారు. కానీ, బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లకుండా నేరుగా ప్రగతి భవన్కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం పైలెట్ ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి సమాచారం ఇచ్చారు.

సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం మాటమార్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికారులు షార్ట్ నోటీస్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్పమాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని తన పీఏ శ్రవణ్తో ఈడీ ఆఫీసుకు లేఖ పంపారు. కేసీఆర్తో భేటీ తర్వాత కూడా కాసేపు ప్రగతిభవన్ లోనే ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి .. ఆ తర్వాత కాన్వాయ్ లేకుండా తన కారులో నగరంలో చక్కర్లు కొట్టారు. అయితే ఈడీ విచారణకు రాలేనన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. 

వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు 2015 నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను అందించాలని ఈడీ ఆదేశించింది. ఆధార్ కార్డు, పాస్ పోర్టు సహా విద్యార్హతలు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను సైతం ఈడీ అధికారులు అందించిన ఫార్మాట్ లో తీసుకురావాలని చెప్పారు.