
బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆరోపణలపై వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. దీనికి వారు సిద్దమైతే చెప్పాలన్నారు. ఆరోపణలను రుజువు చేయకపోతే బండి సంజయ్, రఘునందన్ రావులు రాజీనామా చేయాలని రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం ఉందని బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై నిన్న సవాల్ విసిరిన రోహిత్ రెడ్డి మరోసారి భాగ్యలక్ష్మి టెంపుల్ కు వచ్చారు.
తన సవాల్ ను సంజయ్ స్వీకరించలేదని, దీంతో ఆయన చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకి అర్థం అయిందని రోహిత్ రెడ్డి అన్నారు.సంజయ్ నిజమైన హిందువు కాదన్నారు. తాను నిజమైన హిందువుగా అమ్మవారి వద్ద సవాల్ చేశానని రోహిత్ చెప్పారు. బండి సంజయ్ మతం పేరుతో రెచ్చగొట్టి యువతని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రఘునందన్ రావు పఠాన్ చెరులో పరిశ్రమల నుంచి డబ్బులు వసూళ్లు చేయలేదా అని రోహిత్ ప్రశ్నించారు.
సర్పాన్ పల్లి ప్రాజెక్టు దగ్గర తనకు రిసార్ట్ ఉన్నట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న రోహిత్ ... తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై వస్తున్న విమర్శల్లో కొత్తేమి లేదన్నారు. బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా లేనివారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని, అధికార దుర్వినియోగానికి బీజేపీ నేతలు పాల్పడుతున్నారని రోహిత్ రెడ్డి మండిపడ్డారు.