ఐ బొమ్మ రవి అరెస్ట్ అయినా.. ఆగని పైరసీ.. పుట్టుకొస్తున్న కొత్త వెబ్‌‌సైట్లు

ఐ బొమ్మ రవి అరెస్ట్ అయినా.. ఆగని పైరసీ.. పుట్టుకొస్తున్న కొత్త వెబ్‌‌సైట్లు
  • క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’ పైరసీ ప్లాట్​ఫామ్​కు రీడైరెక్ట్
  • ‘ఐబొమ్మ వన్’ పేరుతో తాజాగా ప్రత్యక్షం
  • అందులో సినిమాలు లేవు, రివ్యూలే ఉన్నాయని పోలీసుల ప్రకటన

హైదరాబాద్ సిటీ, బషీర్ బాగ్,  వెలుగు: ఐబొమ్మ రవి అరెస్ట్​తో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలకు నాలుగు రోజులు తిరగకముందే మళ్లీ షాక్ తగిలింది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ, బప్పం సైట్లను క్లోజ్​చేయించిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఐబొమ్మ వన్’’​ పేరుతో గురువారం కొత్త వెబ్‌‌సైట్ కనిపించడం కలకలం రేపింది. 

ఈ సైట్‌‌లో కొత్త సినిమాలు కనిపించగా వాటిపై క్లిక్ చేస్తే మూవీ రూల్జ్​అనే పైరసీ ప్లాట్‌‌ఫామ్‌‌లకు రీడైరెక్ట్ అవుతున్నది. ఐబొమ్మ గ్లోబల్ నెట్ వర్క్ టీమ్ ఈ పైరసీ వెబ్ సైట్లు నిర్వహిస్తుందా? లేక కొత్తవారు తయారు చేశారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో మూవీరూల్జ్, తమిళ్‌‌ఎమ్‌‌వీ వంటి సైట్లపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

కొత్త డొమైన్లతో సైట్లు

ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం, ఐరాధా అనే మూడు వెబ్ సైట్లను నిర్విహించాడు. ఇందులో ఐబొమ్మ పాపులర్ డొమైన్ కాగా, రవి అరెస్ట్ తర్వాత మరింత ట్రెండింగ్ లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో దీన్ని చాలా మంది పైరసీదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐబొమ్మ క్లోజ్ కావడంతో.. ఆ వెబ్ సైట్ ను పోలిన కొత్త వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఐబొమ్మ వన్ కూడా అలాంటిదే. ఈ సైట్​లో సినిమా సినిమాలు లేకపోయినప్పటికీ.. థంబ్ నెయిల్ పై క్లిక్ చేస్తే అవి మూవీ రూల్జ్​అనే పైరసీ వెబ్ సైట్ కు రీడైరెక్ట్​అవుతున్నాయి. 

ఈ విషయం విపరీతంగా ప్రచారమవడంతో సిటీ సైబర్​క్రైమ్​పోలీసులు స్పందించారు. ఐబొమ్మ వన్ వెబ్​సైట్​లో సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే వస్తున్నాయని, ఎక్కడికీ రీడైరెక్ట్ కావడం లేదని, సినిమాలు ఓపెన్ కావడం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే, పొద్దంతా మూవీ రూల్జ్​కు రీ డైరెక్ట్​అయినా పోలీసులు ప్రకటన చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వివిధ సినిమాల ట్రైలర్స్, రివ్యూస్ మాత్రమే వచ్చాయి.

ఐబొమ్మ అయిపోయింది.. ఇప్పుడు మూవీ రూల్జ్

ఐబొమ్మ రాకముందు నుంచే మూవీ రూల్జ్​లో కొత్త కొత్త సినిమాలు ఉండేవి. ఇందులో రెండు రకాల పైరసీ మూవీలు పెట్టేవారు. ఒకటి థియేటర్లలో స్పైకెమెరాలు, ఫోన్ ద్వారా రికార్డ్ చేసినవి కాగా రెండోది సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేసినవి. రెండు నెలల కింద హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు బిహార్​కు చెందిన అశ్వనీకుమార్ ను అరెస్ట్ చేశాడు. ఇతడు డిజిటల్ సినిమా ప్యాకేజీలు తయారు చేసి, డిస్ట్రిబ్యూషన్ సంస్థల సర్వర్లను హ్యాక్​చేసి విడుదలకు ముందే వాటిని దొంగిలించి మూవీ రూల్జ్​కు ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 

అయితే, మూవీ రూల్జ్ కు సంబంధించి అసలు అడ్మిన్ ఎవరన్నది ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఐబొమ్మను క్లోజ్​చేసిన నాలుగు రోజులకే ఐబొమ్మ వన్​అంటూ వచ్చిన వెబ్ సైట్ ప్రేక్షకులను మూవీ రూల్జ్​కు తీసుకువెళ్లడం సంచలనంగా మారింది. ఇప్పుడు పోలీసుల టార్గెట్ మూవీ రూల్జ్ గా మారింది. రోజుకు వందల్లో పైరసీ సైట్లు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఐబొమ్మ రవి లేక మూవీ రూల్జ్​నిర్వాహకులనో అరెస్ట్​ చేస్తే కొద్ది రోజుల వరకు బ్రేక్​పడొచ్చు గానీ, పైరసీ సమూలంగా ఆగిపోయే అవకాశమే లేదని ఎక్స్​పర్ట్స్​అంటున్నారు.

సీవీ ఆనంద్​ ట్వీట్ ఏం చెప్తున్నదంటే

హ్యాకర్లు, సైబర్ క్రైమ్స్ పూర్తిగా అంతమవుతాయని భావించడం అసాధ్యమని, నివారణ మాత్రమే శాశ్వత పరిష్కారమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్ గురువారం ‘ఎక్స్’​లో పోస్టు చేశారు. ఐబొమ్మ రవి అరెస్టుతో పైరసీ ఆగుతుందా అని ప్రముఖ న్యాయనిపుణుడు కట్కూరి.. వీ6 వెలుగులో రాసిన ఆర్టికల్​ను ‘ఎక్స్’​లో ట్యాగ్​చేస్తూ ఆయన ఈ అభిప్రాయన్ని పంచుకున్నారు. ‘హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. 

ఒకడు పోతే మరొకడు వస్తాడు, అది కూడా ఇంకా లేటెస్ట్​టెక్నాలజీతో.. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశ. పెద్ద, సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్‌‌ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు అన్నీ ఆగిపోయాయా!!??..మనిషి ఉన్నంత కాలం ఈ రకాల నేరాలు కూడా ఉంటూనే ఉంటాయి’ అని అందులో పేర్కొన్నారు.

ఐబొమ్మ కేసులో  ముగిసిన రవి ఫస్ట్​డే కస్టడీ

‘ఐబొమ్మ’ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం చంచల్ గూడ జైలులో నుంచి కస్టడీకి తీసుకొని విచారించారు. రవి కొంతకాలంగా నిర్వహించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని నెట్‌‌వర్క్‌‌, ఇంటర్నెట్ సోర్స్‌‌, విదేశీ లింకులపై ప్రశ్నించినట్టు తెలిపింది.

ఎన్‌‌ఆర్‌‌ఐ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్‌‌లు, పలు డిజిటల్ వాలెట్లతో పాటు దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాలపై ఆరాతీసినట్టు సమాచారం. ఐబొమ్మ వెబ్‌‌సైట్‌‌ నిర్వహణలో ఉపయోగించిన ఐపీ అడ్రెస్‌‌లు, సర్వర్ల కోసం ఎన్జల్ ఐపీ మాస్క్ వాడకం, ఐపీ అడ్రెస్‌‌లను మారుస్తూ కార్యకలాపాలు సాగించిన విధానంపై విచారించారని తెలిసింది. మరో నాలుగు రోజులు కస్టడీలో ఉంచుకొని రవిని ప్రశ్నించనున్నారు.