- చురుగ్గా పని చేస్తున్న టీజీఎంసీ
- వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏడాదిన్నరలో 53 మందిపై కేసులు
- సంబంధిత హాస్పిటల్స్, క్లినిక్స్సీజ్ చేయాలని సూచించినా పట్టించుకోవట్లే
- యథావిధిగా నడుస్తున్న దవాఖానలు
వరంగల్, వెలుగు: పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివినవారు కొందరు.. మెడికల్ షాపుల లైసెన్స్‌లు, ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికెట్లుఅడ్డం పెట్టుకొని ఇంకొందరు.. చెవులు వినపడని, పూర్తిస్థాయిలో కళ్లు కనిపించనివారు సైతం ఓరుగల్లులో డాక్టర్ల అవతారమెత్తారు. పిల్లలు, గర్భిణులు అన్నది లేదు.. అందరికీ ప్రమాదకర స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ఇస్తూ సర్జరీలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఫేక్డాక్టర్లపై కేసులు పెట్టడంలో ఉత్సాహం చూపుతున్న అధికారులు.. చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
దీంతో వారం తిరిగేలోపే వారు మళ్లీ మెడలో స్టెతస్కోప్ వేసుకొని, తెలిసీతెలియని ట్రీట్‍మెంట్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు ఈ ఫేక్ డాక్టర్లను కట్టడి చేయకుండా.. వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
టీజీఎంసీ తనిఖీలు
రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, అనుమతి లేకుండా హాస్పిటల్స్నడుపుతూ.. పేషెంట్ల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నవారి ఆటకట్టించేందుకు తెలంగాణ వైద్య మండలి(టీజీఎంసీ) చురుగ్గా పని చేస్తోంది. చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య కుమార్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా డాక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నాయి. ట్రీట్‍మెంట్ ఫెయిల్యూర్ ఘటనలు, పేషెంట్ల ఫిర్యాదుల మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని ఫేక్ డాక్టర్లు, వారు నడిపిస్తున్న దవాఖానలు, క్లినిక్‌లపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో గడిచిన ఏడాదిన్నరలో కేవలం వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే 53 మంది ఫేక్ డాక్టర్లపై కేసులు నమోదయ్యాయి.
కలెక్టర్లు, డీఎంహెచ్వోలు స్పందించాలి
నకిలీ డాక్టర్లు, నిబంధనలకు విరుద్ధంగా నడిచే హాస్పిటల్స్, క్లినిక్‌లపై జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వారు పట్టించుకోకపోవడంతో గల్లీగల్లీలో దవాఖానలు వెలుస్తున్నాయి. ఫేక్ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ఇలాంటివారిపై తెలంగాణ వైద్య మండలి బృందాలు కేసులు పెడుతున్నాయి. అయితే, సీరియస్ యాక్షన్ తీసుకోవడంతోపాటు రూల్స్‌కు విరుద్ధంగా తెరిచిన హాస్పిటల్స్, క్లినిక్‍లను సీజ్ చేసే అధికారం జిల్లాల్లో కలెక్టర్లు, డీఎంహెచ్‍వోల చేతిలో ఉంది. వీరు స్పందిస్తేనే నకిలీ డాక్టర్ల కట్టడి సాధ్యమయ్యే అవకాశం ఉంది.
అధికారుల తీరుపై విమర్శలు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఫేక్ డాక్టర్లపై చర్యలు తీసుకునే విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పలువురి ప్రాణాలు పోవడానికి, సరైన వైద్యం అందించకపోవడంతో బాధితుల కాళ్లు, చేతులు పడిపోవడానికి కారణమైన ఫేక్ డాక్టర్ల హాస్పిటల్స్, క్లినిక్ లు, ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లను సీజ్ చేయాలని ఈ రెండు జిల్లాల ఉన్నతాధికారులకు టీజీఎంసీ సూచనలు చేసింది. కేసులు నమోదైన మొత్తం 53 మంది ఫేక్డాక్టర్లు నడిపే దవాఖానలను సీజ్ చేయాలని స్వయంగా టీజీఎంసీ చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య కుమార్ చెప్పినా.. పట్టుమని పది సెంటర్లను సీజ్ చేయని దుస్థితి నెలకొంది. ఫలితంగా టీజీఎంసీ బృందం ఉరుకులు, పరుగులతో పని చేసినా.. ఆపై చర్యల్లేకపోవడంతో నకిలీ వైద్యులు పేద, మధ్యతరగతి జనాల ప్రాణాలతో మెడికల్ బిజినెస్ చేస్తున్నారు.
