రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయారెడ్డి

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయారెడ్డి

పీజేఆర్ అంటే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ కూతురు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పేదోళ్ల కోసమే చివరి వరకు పోరాటం చేసిన నాయకుడు పీజేఆర్ అని ఆయన బిడ్డ విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి రావడం సంతోషకరమన్నారు రేవంత్ రెడ్డి. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతలకు విడదీయరాని బంధం ఉందని..పీజేఆర్ పెంచి పోషించిన వాళ్ళు చాలామంది నాయకులయ్యారన్నారు. అటువంటి కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పారు. బస్తీ ప్రజలకు ఆయన ఎల్లవేళలా అండగా నిలిచారని..పీజేఆర్ వల్ల లక్షలాది మంది ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు.

 

మళ్లీ మన కాంగ్రెస్… …………………………. భాగ్యనగరంలో కాంగ్రెస్ పూర్వవైభవానికి తొలి అడుగు పడింది. కాంగ్రెస్ రక్తం ప్రవహించే...

Posted by Anumula Revanth Reddy on Thursday, June 23, 2022

సొంత పార్టీలోనే ప్రజలకోసం గళం విప్పిన నాయకుడు పీజేఆర్ అని రేవంత్ అని అన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం చేశాడని..కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా పీజేఆర్ వల్లనే పూర్తి అయ్యిందన్నారు. హైదరాబాద్ నగరంలో నీళ్లకోసం బిందెలతో నిరసన తెల్పడం నేర్పిందే పీజేఆర్ అని..అసెంబ్లీలో కూడా పీజేఆర్ నీళ్లకోసం, ఇళ్ల కోసం పోరాటం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమల్లో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు ముందుండి పోరాటం చేసేవాడన్నారు. ఇప్పుడు పీజేఆర్ ఉంటే..ఫార్మా భూసేకరణకు అడ్డుగా పోరాటం చేసేవారని తెలిపారు. పేదోళ్లకోసం పెద్దమ్మ గుడి ఉండాలని కట్టిస్తే..మొన్న ఆ గుడి దగ్గరే అఘాయిత్యం జరిగిందన్నారు. నగరంలో పేదోళ్లకు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. హైదరాబాద్ ముఖచిత్రం మార్చడానికి కేసీఆర్ సర్కార్ పనిచేస్తలేదని..ఆ బాధ్యతను పీజేఆర్,అంజన్ కుటుంబాలు తీసుకుంటాయని అన్నారు.

నాన్నగారి ఆశయాలతో ముందుకు సాగుతా

ఖైరతాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానని.. పీజేఆర్ బిడ్డగా తనను ఆశీర్వాదిస్తూ ముందుకు నడిపిస్తున్న వారికి విజయారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ లో చేరడం తొందరపాటు నిర్ణయం కాదని..పదవులు కోసం కాంగ్రెస్ లో చేరలేదని చెప్పారు. రెండు నెలలుగా దేశంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జంట నగరాల్లో మహిళలను కాపాడుకోలేకపోతున్నామని..యువత తప్పుదారి పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ పథకాలను ప్రకటిస్తున్నారని..తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  రైతుల పక్షాన ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. నాన్నగారి ఆశయాలతో ముందుకు వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.