40 వేల ఉద్యోగాలిచ్చేందుకు ప్లాన్‌‌ రెడీ చేస్తున్నం : వంశీకృష్ణ

40 వేల ఉద్యోగాలిచ్చేందుకు ప్లాన్‌‌ రెడీ చేస్తున్నం : వంశీకృష్ణ
  • సింగరేణి ఓసీపీలు, జైపూర్ పవర్ ప్లాంట్‌‌లో స్థానికులకే ఉద్యోగాలు: వంశీకృష్ణ
  • బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది 
  • చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన వివేక్‌‌ వెంకటస్వామి కుమారుడు


రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన 40 వేల ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ మొదలుపెట్టామని స్థానిక ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్‌‌ యువనేత గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సింగరేణి ఓసీపీలు, జైపూర్ పవర్​ప్లాంట్లలో 80 శాతం ఉద్యోగాలు ఇకపై స్థానికులకే దక్కుతాయని, ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సింగరేణి ఓసీపీల్లో, జైపూర్ పవర్ ప్లాంట్‌‌లో స్థానికులకు, భూ నిర్వాసితులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారన్నారు. దీనిపై స్పందించిన సీఎం సింగరేణి యాజమాన్యం ద్వారా ఆదేశాలు జారీ చేయించారని తెలిపారు. బుధవారం చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

దారి పొడవునా పలకరింపులు

వంశీకృష్ణ తన పర్యటనలో ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ పార్టీ గెలుపునకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో కార్యకర్తలతో మాట్లాడారు. గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్‌‌‌‌ దగ్గరున్న కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి, ఎన్టీపీసీ కృష్ణానగర్ దగ్గర వంశీకృష్ణకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. గోదావరిఖనిలో కార్మికుడు ముదాం రాజేందర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, లీడర్లు మల్లికార్జున్, విజయ్‌‌‌‌, పాకాల గోవర్ధన్‌‌‌‌ రెడ్డి, మల్లేశ్‌‌ యాదవ్‌‌‌‌, మధు, దీపక్, జీన్స్, జావీద్, గడ్డం మధు, సుభాశ్‌‌, భూమయ్య, చిరంజీవి, మహేందర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

 సమస్యలన్నీ పరిష్కరిస్తం

నియోజకవర్గంలో తాగు నీరు, రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వంశీకృష్ణ తెలిపారు. ఎక్కడ తాగు నీటి సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని, అవసరమైన చోట్ల బోర్లు వేయిస్తామన్నారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలతో చర్చించి సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కష్టపడ్డారని, వారికి ఎమ్మెల్యే అండగా ఉంటారన్నారు. చెన్నూరులో బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. వివేక్​వెంకటస్వామి గెలుపు ప్రజల గెలుపన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలని లీడర్లు, కార్యకర్తలకు ఆయన సూచించారు.