ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం

ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండు నుంచి పోఖారాకు వస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 72 మంది ఉన్నారు. వారిలో 68 మంది ప్యాసింజర్లు కాగా.. నలుగురు ఎయిర్ లైన్స్ సిబ్బంది  ఉన్నారు. నేపాల్ మీడియా వార్తల ప్రకారం ఇప్పటి వరకు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది మృతదేహాలను వెలికితీశారు. పాత కొత్త ఎయిర్ పోర్టు మధ్యలో ఈ విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ట్విన్ ఇంజిన్ ఏటీఆర్ 72 విమానం నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి  పోఖారా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే విమానం నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 10.33గంటలకు ఖాట్మాండు నుంచి టేకాఫ్ తీసుకుంది. పోఖారా ఎయిర్ పోర్టులో మరికాసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉండగా.. సేతి నది ఒడ్డున ఒక్కసారిగా కుప్పకూలింది. విమానం ఖాట్మాండు నుంచి పోఖారా చేరుకునేందుకు 25నిమిషాల సమయం పడుతుండగా.. ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను చూస్తే విమానంలో ఎవరూ బతికే అవకాశంలేదని అధికారులు అంటున్నారు.