- అరణ్య భవన్‌లో టైగర్ సెల్ ద్వారా పులుల కదలికలపై నిఘా
- వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త మార్పు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పులుల సంరక్షణకు ప్రభుత్వం మరో ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ‘స్టేట్ లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించింది. పులల పరిరక్షణకు ఈ సెల్ కీలకంగా మారనుంది. అలాగే పులులకు రేడియో కాలర్ అమర్చే కార్యక్రమానికి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. ఎన్టీసీఏ నుంచి అనుమతి రాగానే రేడియో కాలర్ అమర్చే పనిని ప్రారంభించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ డేటాను టైగర్ సెల్ నుంచే సేకరించి విశ్లేషించనున్నారు. ఈ విధానం కారణంగా జాతీయ పులుల లెక్కల్లో తెలంగాణకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.
పులుల కదలికలపై నిరంతరం నిఘా
దేశంలోని అనేక రాష్ట్రాల్లో జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా.. తెలంగాణలో మొత్తం అటవీ ప్రాంతం కవర్ చేసే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కొంత మేరకు అమల్లో ఉన్నా.. వన్యప్రాణి విభాగాలు ఆయా విభాగాల పరిధిలోనే పని చేస్తాయి. కానీ టైగర్ సెల్ ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నిత్యం పులులు, చిరుత పులుల కదలికలను పర్యవేక్షిస్తోంది. పులులు, వాటి మధ్య ఘర్షణ, మనుషులు, పులుల మధ్య సంఘర్షణ ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచుతుంది. ఆ ప్రాంతాన్ని అనునిత్యం పర్యవేక్షిస్తూ మ్యాపింగ్ చేయనుంది.
అటవీ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ట్రాకింగ్ సైతం చేస్తుంది. యాంటీ- పోచింగ్, రెస్క్యూ బృందాలు వెంటనే పెట్రోలింగ్ చేసేలా దోహదం చేయనుంది. వీటన్నింటినీ సమగ్రంగా ఒకే చోట నిర్వహించే వ్యవస్థ టైగర్ సెల్ కింద పని చేయనుంది. రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఏటూరునాగారం, కిన్నెరసాని, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని పులుల కదలికలను ఈ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ అడవులను ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాలతో కలిపే ఈ మార్గం దేశవ్యాప్తంగా టైగర్ కారిడార్‌గా గుర్తించి ఈ ప్రాంతాల్లో నిఘా ఉంచనున్నారు.
పులుల సంచారం ఉన్న చోట ఏర్పాటు చేసిన క్విక్ రియాక్షన్ టీమ్స్‌పై ఈ సెల్‌కు నియంత్రణ ఉంటుంది. టైగర్ కమాండ్ సెంటర్ నుంచే డైరెక్ట్‌గా టీమ్స్‌ను పంపే విధానాన్ని అవలంబించనుంది. పులులు గ్రామాల వద్ద కనిపించినా, వేటగాళ్ల కదలికలున్నా, పశువులపై దాడులు జరిగినా, గాయపడిన పులులకు చికిత్స అవసరమైనా మరింత వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
అడవులు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయం
అడవులు, వన్య ప్రాణుల సంరక్షణే ప్రజా ప్రభుత్వం ధ్యేయం. వన్యప్రాణులు ఇతర జీవుల మనుగడపై మన ఉనికి ఆధారపడి ఉంది. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం. మనుషుల భద్రత, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. వాటి ఆధారంగా ముందుకెళ్తున్నాం. – మంత్రి కొండా సురేఖ
