హైదరాబాద్ ఫుట్పాత్లపై ప్లాస్టిక్ టైల్స్.. జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి ప్రాసెసింగ్

హైదరాబాద్ ఫుట్పాత్లపై ప్లాస్టిక్ టైల్స్.. జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి ప్రాసెసింగ్
  • రాజ్​భవన్​ రోడ్డులో ప్రయోగాత్మకంగా అమలు
  • సక్సెస్​ అయితే సిటీ అంతటా విస్తరణ 


హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఉత్పత్తి అవుతున్న చెత్తలోని ప్లాస్టిక్ నుంచి టైల్స్ తయారు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీటిని గ్రేటర్ లోని ఫుట్ పాత్​లపై ఏర్పాటు చేయాలని కమిషనర్​కర్ణన్​ప్లాన్​చేస్తున్నారు. ఈ తరహాలో ఫుట్​పాత్​పై టైల్స్​ను ఇప్పటికే మైసూర్ లో వాడుతున్నారు. చెత్తతో ప్లాస్టిక్​టైల్స్​తయారు చేసి ఫుట్​పాత్ లపై వాడడం వల్ల బల్దియాపై ఆర్థిక భారం తగ్గుతుందని, అలాగే, సర్వీసు కూడా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 

రోజూ 8 వేల టన్నుల చెత్త 

నగరంలో ప్రస్తుతం రోజూ 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 30 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అయితే, జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆవరణలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ లో ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి దాంతో పలు నమునాలతో ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయాలని  నిర్ణయించారు. దీనిద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ప్లాస్టిక్ కూడా పేరుకుపోకుండా ఉంటుందని భావిస్తున్నారు.  

 పైలట్ ప్రాజెక్టు కింద..

రాజ్ భవన్ రోడ్డులో కిలోమీటర్​మేర ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నాలుగేండ్ల కింద గచ్చిబౌలిలోని పెట్స్ పార్కు వద్ద గేట్ ముందు ఇదే తరహాలో  ప్లాస్టిక్ టైల్స్ వేసిన అధికారులు ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్​కర్ణన్​దీన్ని ఇప్పుడు పక్కాగా, పర్మినెంట్​గా అమలు చేయాలని ప్లాన్ చేశారు.  ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద రాజ్ భవర్ రోడ్డులో వేసి తర్వాత దశల వారీ ప్లాస్టిక్ టైల్స్ ఉత్పత్తిని బట్టి మిగతా ప్రాంతాల్లోకి విస్తరించాలని చూస్తున్నారు.