
హైదరాబాద్, వెలుగు: ‘ప్లాస్టిండియా 2023’ పేరుతో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ 11వ ఎడిషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తామని ప్లాస్టిండియా ఫౌండేషన్ శనివారం ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1 నుండి 5 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం (టాప్మా) అధ్యక్షుడు విమలేష్ గుప్తా సమక్షంలో 11వ ఎడిషన్ ఎగ్జిబిషన్‌కు విజిటర్స్ రిజిస్ట్రేషన్ యాప్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ఆవిష్కరించారు.
ప్రపంచం నలుమూలల నుండి వచ్చే విజిటర్లు ఈ యాప్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 మంది ఎగ్జిబిటర్లు తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తారు. గడచిన 30 ఏళ్లలో ఉత్పత్తి వినియోగం అనేక రెట్లు పెరగడంతో భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమ వేగంగా ముందుకుసాగుతోంది.
2020–-21 సంవత్సరంలో భారతీయ ప్లాస్టిక్ ఎగుమతుల విలువ 12.6 బిలియన్ డాలర్లు కాగా, ఇది 2025 నాటికి 25 బిలియన్ డాలర్ల చేరుతుందని అంచనా. తెలంగాణలో పది వేల ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించిన యూనిట్లు ఉన్నాయి. ఇవి డైరెక్టుగా, ఇన్‌డైరెక్టుగా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సుమారు రూ.7,500 కోట్ల టర్నోవర్‌తో తెలంగాణ ప్లాస్టిక్ పరిశ్రమ 2014 నుంచి 100 శాతం గ్రోత్‌ను సాధించింది.