
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్మురేపిన యంగ్ టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ.. రెండో టెస్ట్‌లో కూడా విజయం దిశగా దూసుకుపోతుంది. ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది.
రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్‌లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్.. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించిన పిచ్‌పై రన్స్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. బుమ్రా, సిరాజ్ దెబ్బకు విండీస్ ఓపెనర్లు తంగెనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంబెల్ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు సతమతమయ్యారు. ఈ క్రమంలోనే జాన్ క్యాంబెల్ 25 బంతుల్లో 10 పరుగులు చేసి 7 ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ తంగెనరైన్ చందర్‌పాల్ కాస్త ధాటిగా ఆడే క్రమంలో 67 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు ఇద్దరిని జడేజానే ఔట్ చేశాడు.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అలిక్ అథనాజ్, షాయ్ హోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును కాసేపు పరిగెత్తించారు. 84 బంతుల్లో 41 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోన్న క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చిక్కాడు అలిక్ అథనాజ్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విండీస్ కెప్టెన్ రాస్టన్ చేజ్ జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి డకౌట్ కావడంతో వెనువెంటనే వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రెండో రోజు ఆట ముగిసేసరికి 140 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది విండీస్. జడేజా మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం షాయ్ హోప్ (31) టెవిన్ ఇమ్లాచ్ (14) క్రీజులో ఉన్నారు. ఇండియా కంటే వెస్టిండీస్ ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉంది. ఇండియా బౌలర్ల ఫామ్ చూస్తుంటే మూడో రోజు తొలి సెషన్లోనే విండీస్ చాపచుట్టేసేలా కనిపిస్తున్నారు.