ప్రజల జీవితాలు, హక్కుల కంటే బీజేపీకి రాజకీయాలే ముఖ్యం : మమత 

ప్రజల జీవితాలు, హక్కుల కంటే బీజేపీకి రాజకీయాలే ముఖ్యం : మమత 

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో గెలిచేందుకు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) పేరుతో బీజేపీ కొత్త ఆటలు ఆడుతోందని మండిపడ్డారు. ప్రజల జీవితాలు, వారి హక్కుల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పారు. గుజరాత్ లో మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై అధికార బీజేపీపై విమర్శలు గుప్పించిన మమత.. అక్కడి ప్రభుత్వం ఎన్నికల వాతావరణంలో ఉన్నందున బాధితులకు తగిన సాయం అందడం లేదని ఆరోపించారు. CAAను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

అయితే నిన్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి రాష్ట్రంలో సీఏఏను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం కాకుండా 1955 పౌరసత్వ చట్టం ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చి ప్రస్తుతం గుజారాత్ లోని రెండు జిల్లాలో నివసిస్తున్న మైనార్టీలకు భారత పౌరసత్వం మంజూరు చేస్తున్నట్టు తాజాగా ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత శాసనసభలో సువేందు అధికారి పై వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఏడాది బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది.