- ఇప్పటి వరకు అయిన ఖర్చు..
- ఇంకా అవసరమయ్యే నిధుల వివరాలు ఉండాలి: సీఎం రేవంత్
- ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించే టీ ఫైబర్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయన సోమవారం రాత్రి తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి, వారి పనితీరుపై నివేదిక కోరాలని ఆదేశించారు.
అలాగే, టీ ఫైబర్ సంస్థలోని ఉద్యోగుల సంఖ్య, వారి పని తీరును కూడా సమీక్షించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు అయిన వ్యయం, పనులు పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులు, వాటిని ఎలా సేకరించాలి? ప్రాజెక్టు విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీ ఫైబర్ ప్రాజెక్టును గత ప్రభుత్వం చేపట్టింది. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడం.
ఈ ప్రాజెక్టును తెలంగాణ స్టేట్ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు ద్వారా 83.58 లక్షల ఇండ్లకు 3.5 కోట్లకు పైగా ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కేబుల్స్ వేయడానికి మిషన్ భగీరథ పథకం కింద వేసిన నీటి పైపుల లైన్‌లను ఉపయోగించారు. కేంద్ర ప్రభుత్వ భారత్ నెట్ గ్రాంట్ల ద్వారా నిధులు కూడా వస్తున్నాయి.
