
న్యూఢిల్లీ: సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.తాను లోక్సభ ప్రతిపక్ష నేత అని తెలిపారు. ఎప్పుడు సమావేశాలు జరిగినా తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు. లోక్సభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడేందుకు చాన్స్ ఇస్తున్నారు. నాకు మాత్రం అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. లోక్సభలో మాట్లాడే హక్కు నాకు ఉంది. కేంద్రం ఇలా చేయడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అవుతుంది’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక సెకన్ కూడా సభలో ఉండలేదని విమర్శించారు. ప్రధాని ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారని మండిపడ్డారు.