పీఎల్​జీఏ వారోత్సవాలు.. సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్

పీఎల్​జీఏ వారోత్సవాలు.. సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్

జయశంకర్‌‌ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు : పీపుల్స్​లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్​జీఏ) వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వేడి రాజుకుంది. వారోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు మావోయిస్టులు.. వారిని గ్రామాల్లో అడుగు పెట్టకుండా చేసేందుకు పోలీసులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తుండగా.. పోలీసులు అడవులను, సరిహద్దు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. పల్లెనిద్ర పేర ఊళ్లకు వెళ్లి యూత్​తో మాట్లాడుతున్నారు. అప్పటి పీపుల్స్​వార్ పార్టీ అగ్ర నేతలు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేశ్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేశ్ అలియాస్​ జగన్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మల్హర్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో1999 డిసెంబర్ 2న జరిగిన పోలీస్‌‌ ఎన్​కౌంటర్​లో చనిపోయారు. వారి మొదటి వర్థంతి సందర్భంగా పీపుల్స్​వార్​పార్టీ 2000 డిసెంబర్​2న పీఎల్జీఏను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 2 నుంచి 8 వరకు వారోత్సవాలను జరుపుకుంటున్నారు. 2004లో పీపుల్స్​వార్​మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. 

ప్రజా సైన్యంలో చేరాలని  పిలుపు

పీఎల్​జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టులు ములుగు, భూపాలపల్లి, హనుమకొండ తదితర జిల్లాల్లో విస్తృతంగా పాంప్లెంట్లు పంచారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌‌, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, చర్ల‒శబరి, మహాదేవపూర్‒ఏటూరునాగారం ఏరియాల కమిటీ సెక్రటరీలు అరుణ, సబిత వేర్వేరుగా జారీ చేసిన ప్రకటనల్లోనూ అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పీఎల్​జీఏ ఏర్పడి 23 ఏండ్లు నిండిన సందర్భంగా వారం రోజుల పాటు ప్రజలు, ప్రజాసంఘాలు సభలు, సమావేశాలు జరుపుకోవాలని.. విప్లవాన్ని బలోపేతం చేసేందుకు యువత ప్రజాసైన్యంలో చేరాలని కోరారు. 

యూత్​ మీద పోలీసుల ఫోకస్​

తెలంగాణలో కొంత కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా సద్దుమణిగాయి. తిరిగి ఇటీవల ఛత్తీస్​గఢ్ సరిహద్దుల్లో వారి కదలికలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాల పేరిట మావోయిస్టులు మళ్లీ ఈ ప్రాంతంలో బలపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులు అటవీ గ్రామాల్లో పల్లె నిద్రలు చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మావోయిస్టు పార్టీలో చేరకుండా యువతకు అవగాహన కల్పిస్తున్నారు. స్టూడెంట్స్​కు, ఉద్యోగాలకు ప్రిపేర్​అవుతున్న యూత్​కు బుక్స్ అందించడమే కాకుండా.. కోచింగ్​ ఇస్తున్నారు. అటవీ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతంలోని పోలీస్​స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు. ఆయా పీఎస్​ల పరిధిలో ఇన్​ఫార్మర్ వ్యవస్థను పటిష్ఠం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరికలతో నిఘా పెంచారు. గ్రామాల్లో వెహికల్ చెకింగ్ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఛత్తీస్​గఢ్​ నుంచి వలస వచ్చిన గొత్తికోయలపై ఫోకస్​పెట్టారు.