- జిల్లాలో 40 శాతం ఎస్సీలు ఉన్న గ్రామాలే సెలెక్ట్
- ఈ పథకం కింద ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షల నిధులు
- విలేజ్ డెవలప్మెంట్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్, వెలుగు : షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం–అజయ్ (ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో ఉన్న ఆరు గ్రామాలు ఎంపికయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా 473 గ్రామ పంచాయతీలు ఉండగా, 40 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉన్న కమలాపూర్, కొత్తపల్లి–జి, సావర్‌గాం, లంచంపూర్, కొత్తూర్, హీరాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపికైన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, విద్య, జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పనులను గుర్తించి విలేజ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (వీడీపీ) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, జిల్లా స్థాయి కమిటీలు పథకం అమలును ప్రతి నెలా సమీక్షించనున్నాయి.
ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల నిధులు
పీఎం–అజయ్ పథకం కింద ఎంపికైన ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఎస్సీల పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కుటుంబాల అవసరాల సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి, వాటిని పీఎం–అజయ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి. గ్రామ సభల్లో అభివృద్ధి అవసరాలపై చర్చించి వీడీపీని రూపొందిస్తారు. అనంతరం గ్రామ, జిల్లా స్థాయి కమిటీల ఆమోదం పొందిన ప్రతిపాదనలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
కేంద్రం పరిశీలించి నిధులు విడుదల చేస్తుంది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.
కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం
పీఎం–అజయ్ పథకం కింద జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపికయ్యాయని డీఎల్పీవో ఫణీందర్‌రావు తెలిపారు. వీడీపీలు రూపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, ఇప్పటికే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఓరియంటేషన్ నిర్వహించామని చెప్పారు. గ్రామ సభల్లో గుర్తించిన అభివృద్ధి అవసరాలను పోర్టల్‌లో నమోదు చేసిన అనంతరం, కమిటీల ఆమోదంతో కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వివరించారు.
40 శాతం ఎస్సీ జనాభా ఉన్న పీఏం అజయ్ గ్రామానికి ఎంపికైన గ్రామాలు..
మండలం గ్రామం మొత్తంజనాభా ఎస్సీలు
గుడిహత్నూర్ కమలాపూర్ 711 337
తాంసీ సావర్గాం 610 272
ఇంద్రవెల్లి హీరాపూర్ 672 329
గాదిగూడ కొత్తపల్లి జి 796 397
తలమడుగు కొత్తూర్ 612 274
తలమడుగు లచ్చంపూర్ 591 237
