ఇవాళ లాక్​డౌన్​పై నిర్ణయం? కంటెయిన్​మెంట్ జోన్లపైనే స్పెషల్‌ ఫోకస్

ఇవాళ లాక్​డౌన్​పై నిర్ణయం? కంటెయిన్​మెంట్ జోన్లపైనే స్పెషల్‌ ఫోకస్

న్యూఢిల్లీ:  ఫోర్త్ ఫేజ్ లాక్​డౌన్ ఇంకో రోజులో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. జూన్ 1 తర్వాత పరిస్థితి ఏంటి అనే దానిపై చర్చించారు. కరోనా కేసులు, లాక్​డౌన్ పొడిగింపు, సడలింపులు తదితరాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రులతో ఫోన్​లో జరిపిన చర్చల గురించి, సీఎంలు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి మోడీకి షా వివరించారు. శుక్రవారం లోక్​కల్యాణ్ మార్గ్​లోని ప్రధాని ఇంట్లో జరిగిన మీటింగ్​లో కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. లాక్​డౌన్​పై శనివారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆంక్షల విషయంలో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి దశలో ఉన్నంత ఫోకస్​గా ఇప్పుడు లాక్​డౌన్ ఉండకపోవచ్చని అంటున్నాయి. ఐదో దశలో మరిన్ని సడలింపులు ఉంటాయని, ఫోకస్ మొత్తం కంటెయిన్​మెంట్ జోన్ల మీదే ఉంచనున్నారని పేర్కొంటున్నాయి.

సీఎంల నుంచి ఫీడ్​బ్యాక్

లాక్​డౌన్ పొడిగింపుపై సీఎంల అభిప్రాయాలను షా అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31 తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ముఖ్యమంత్రులు తమ ఫీడ్​బ్యాక్ ఇచ్చారు. ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపైనా చర్చించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలు మరికొన్ని రోజులపాటు లాక్​డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగిస్తూనే.. రూల్స్​ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

ఇక లాక్​డౌన్ 5.0!

మార్చి 24న దేశమంతటా 21 రోజుల పాటు లాక్​డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. తర్వాత కొన్ని సడలింపులతో లాక్​డౌన్​ను మూడు సార్లు పొడిగించారు. ఆదివారంతో నాలుగో దశ ముగియనుంది. ఈ క్రమంలో శనివారం లాక్​డౌన్ 5.0పై ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు లాక్​డౌన్​ను మరికొన్ని రోజులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు మాత్రం లాక్​డౌన్​ను ముగించాలని కోరినట్లు సమాచారం.

మరో రెండు వారాలు?

‘‘లాక్​డౌన్​ను పొడిగించాలని మెజారిటీ ముఖ్యమంత్రులు కోరుతున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సడలింపులు ఇవ్వాలని, ఎకనమిక్ యాక్టివిటీలు ఓపెన్ చేసేందుకు, నార్మల్ లైఫ్ మొదలయ్యేందుకు దారులు తెరవాలని కోరుతున్నారు” అని అధికారులు చెప్పారు. మరో రెండు వారాలు లాక్​డౌన్ పొడిగించే అవకాశం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు.

13 జిల్లాల్లోనే ఎక్కువ

సీకే మిశ్రా, వీకే పాల్​ఆధ్వర్యంలోని రెండు స్పెషల్ కొవిడ్ ప్యానల్స్ తమ రికమండేషన్లను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, రిలీజియస్ సెంటర్లు మినహా మిగతా వాటిపై ఆంక్షలు ఎత్తేయాలని సూచించినట్లు సమాచారం. ఇంటర్ స్టేట్ ట్రావెల్​పై నిషేధం కొనసాగించాలని ప్యానల్ సూచించింది. అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటెయిన్​మెంట్ మెజర్లు మరింత పెంచాలని రికమండ్ చేసింది. ‘‘దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 70 శాతం 13 జిల్లాల్లోనే ఉన్నాయి. అవి ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణె, హైదరాబాద్, కోల్​కతా, ఇండోర్, జైపూర్, జోధ్​పూర్, చెంగల్​పట్టు, తిరువల్లుర్. వీటిపై మరింత ఫోకస్ పెట్టాలి” అని సూచించినట్లు సమాచారం.

రాష్ర్టాలు ఇలా..

  • హిమాచల్​ప్రదేశ్: రాష్ర్టంలోని హమిర్​పూర్, సోలన్, సిమ్లా జిల్లాల్లో జూన్ 30 వరకు లాక్​డౌన్ ఉంటుందని తెలిపింది.
  • గోవా: మరో రెండు వారాలు లాక్​డౌన్ పొడిగింపు ప్రకటించే అవకాశం ఉంది. 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది.
  • కర్నాటక: రిలీజియస్ ప్రాంతాలను ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతోంది.
  • జమ్మూకాశ్మీర్: 15 రోజులపాటు అమర్​నాథ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది. అలాగే హోటల్స్, హ్యాండీక్రాఫ్ట్​లకు పర్మిషన్ ఇవ్వాలంటోంది.
  • పంజాబ్: శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, మాళ్లు, హాళ్లు క్లోజ్​లోనే ఉంచుతామని చెప్పింది.
  • హర్యానా: లాక్​డౌన్​ కొనసాగింపుకే మద్దతు తెలిపింది. ఢిల్లీతో బోర్డర్​ను క్లోజ్​లోనే ఉంచాలని అంటోంది.
  • ఢిల్లీ: షాపింగ్ మాల్స్, మెట్రో రైళ్లు సహా చాలా వాటిని ఓపెన్ చేయాలని కోరుతోంది.

ఈశాన్య రాష్ర్టాలు: లాక్​డౌన్ ఆంక్షల విషయంలో తమకు మరిన్ని హక్కులు ఇవ్వాలని కోరుతున్నాయి. ఎన్​డీఎంఏ యాక్ట్ ప్రకారం ఇచ్చే గైడ్​లైన్స్ ఫాలో అవుతామని చెబుతున్నాయి.