పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా గ్రూప్​ గౌరవ చైర్మన్​ రతన్​ టాటా

పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా గ్రూప్​ గౌరవ చైర్మన్​ రతన్​ టాటా
  • పీఎం కేర్స్​ ట్రస్టీగా రతన్​ టాటా
  • కరియ ముండా, కేటీ థామస్ కూడా ఎన్నిక

న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ట్రస్టీగా టాటా గ్రూప్​ గౌరవ చైర్మన్​ రతన్​ టాటాను నియమించారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ కేటీ థామస్, మాజీ లోక్​సభ డిప్యూటీ స్పీకర్​ కరియా ముండాను కూడా ఎన్నుకున్నట్టు పీఎంఓ ప్రకటన రిలీజ్​ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన పీఎం కేర్స్ మీటింగ్​కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​తో పాటు కొత్తగా ఎన్నికైన ట్రస్టీలు కూడా హాజరయ్యారు. మాజీ కంప్ర్టోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా రాజీవ్​ మహర్షి, ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ మాజీ చైర్​పర్సన్​ సుధామూర్తి, ఇండికార్ప్స్​ అండ్​ పిరమల్​ ఫౌండేషన్ మాజీ సీఈఓ, టెక్​ఫర్​ ఇండియా కో–ఫౌండర్​ ఆనంద్​షాలు పీఎం కేర్స్​ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా నామినేట్​ అయ్యారు. మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ తెలిపింది.

‘‘పీఎం కేర్స్​కు నిధులు అందజేస్తున్న ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు పీఎం కేర్స్​ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పీఎం కేర్​ చేసిన సేవా కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించారు. 4,345 మంది చిన్నారులకు సాయం ఈ స్కీం కిందే సేవలందిస్తున్నారు. మరింత సమర్థవంతంగా సాయం చేసేందుకు ట్రస్టీలు, సభ్యులతో ప్రధాని  మోడీ చర్చించారు.

పీఎం కేర్స్​కు కొత్తగా ఎన్నికైన ట్రస్టీలు, అడ్వైజరీ బోర్డు సభ్యులకు అభినందనలు తెలిపారు..”అని పీఎంవో పేర్కొంది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి పీఎం కేర్స్​ను ఏర్పాటు చేశారు. 2020–21 ఫైనాన్షియల్​ ఇయర్​లో దాని కార్పస్​ మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకుంది. తాజా ఆడిట్​ ప్రకారం.. వలస కార్మికుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు, కరోనా వ్యాక్సిన్​ డోసుల కోసం రూ.1,392కోట్లు ఖర్చు చేశారు.