
- మూడు కీలక బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా
- తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాల ఎంపీలు
- బిల్లు కాపీలు చించి అమిత్ షాపై విసిరిన సభ్యులు
- అమిత్ షా, కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం
- అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీల తోపులాట
- రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర అని మండిపాటు
- బిల్లు.. రాజ్యాంగ విరుద్ధం: ప్రియాంక గాంధీ
- ‘క్లీనర్ పాలిటిక్స్’ అన్న కేంద్ర ప్రభుత్వం
- నిరసనల మధ్యే 3 బిల్లులను జేపీసీకి పంపిస్తూ తీర్మానం
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని మంత్రి అయినా, దేశ ప్రధాని అయినా తీవ్ర నేరారోపణలతో నెలరోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగేలా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను తీసుకొచ్చింది. ఐదేండ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉన్నట్లైతే 31వ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లుల్లో పేర్కొంది. రాజీనామాకు నిరాకరించినా 31వ రోజు ఆటోమేటిక్‌గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. ఈమేరకు కేంద్రం సిద్ధం చేసిన మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 75 (ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల నియామకం), ఆర్టికల్ 164 (సీఎంలు, రాష్ట్ర మంత్రుల నియామకం)లో మార్పుల కోసం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్‌కు కూడా ఈ నిబంధన వర్తించేలా.. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ (సవరణ) బిల్లు–2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ (సవరణ) బిల్లు –2025ను అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను చించి అమిత్ షాపైకి విసిరారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తున్నదని మండిపడ్డారు. అమిత్ షా మాట్లాడుతుండగానే.. ప్రతిపక్ష, అధికార పార్టీ ఎంపీలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. చివరికి 3 బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ చేసిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.
అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్
బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న టైమ్‌లో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సభలో లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ.. అరెస్టుకు ముందు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని కౌంటర్ ఇచ్చారు.
జైలు నుంచి పాలిస్తారా.. సిగ్గుచేటు: షా
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. దీనికి ముందు బీజేపీ 3 లైన్ విప్ జారీ చేసింది. ఎంపీలంతా సభకు హాజరుకావాలని, బిల్లులపై చర్చల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఆ తర్వాత, అమిత్ షా బిల్లులు ప్రవేశపెట్టిన వెంటనే.. కాంగ్రెస్ ఎంపీలు మనీశ్ తివారి, కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ వాద్రా, ఎంఐఎం నేత అసదుద్దిన్ ఒవైసీ, టీఎంసీ ఎంపీలు వ్యతిరేకించారు. అమిత్ షా మాట్లాడుతూ..‘‘తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగడం సిగ్గుచేటు. వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే.. 31వ రోజు అది ప్రధాని అయినా, సీఎంలైనా, కేంద్ర మంత్రులైనా పదవి కోల్పోతారు. గుజరాత్ హోంమినిస్టర్‌గా తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు నేను పదవికి రాజీనామా చేశా. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి వీ.సెంథిల్ బాలాజీ వంటివాళ్లు నెలల తరబడి జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే పాలన సాగించారు. ఇది కరెక్ట్ కాదు. ఈ బిల్లు చట్టంగా మారితే అందరికీ వర్తిస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.
అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య తోపులాట
అమిత్ షా మాట్లాడుతుండగానే ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి ఆయనపై విసిరారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అపోజిషన్, అధికార పార్టీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, కిరణ్ రిజిజు సహా బీజేపీ ఎంపీలు, మార్షల్స్ అమిత్ షాకు రక్షణగా నిలబడ్డారు. ఎంత రిక్వెస్ట్ చేసిన ఎంపీలు వినిపించుకోకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
బిల్లులను జేపీసీకి పంపిస్తూ తీర్మానం
బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే తీర్మానానికి వాయిస్ ఓటు ద్వారా ఆమోదం లభించినట్లు అమిత్ షా తెలిపారు. కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. కమిటీత తన రిపోర్టును వచ్చే వింటర్ సెషన్ ప్రారంభంలో హౌస్‌కు సబ్మిట్ చేస్తుంది. నవంబర్ మూడో వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర: ప్రతిపక్షాలు
అమిత్ షా ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకే బీజేపీ ఈ బిల్లులు ప్రవేశపెట్టిందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. మోదీ, అమిత్‌షా రాష్ట్రాలను అస్థిర పర్చేందుకు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. కొత్త బిల్లు సమాఖ్య, న్యాయవ్యవస్థలను తప్పించుకొని వెళ్తున్నదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ బిల్లులు దేశాన్ని ‘పోలీస్ స్టేట్’గా మారుస్తాయని ఎంఐంఎ నేత అసదుద్దిన్ ఓవైసీ మండిపడ్డారు.వామపక్ష సభ్యులు కూడా వీటిని వ్యతిరేకించారు.
బిల్లుకు మద్దతిచ్చిన శశిథరూర్
ప్రతిపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుంటే.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం మద్దతిచ్చారు. ప్రతిపక్షాల వాదనలను తప్పుబట్టారు. ‘‘ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇందులో ఎలాంటి తప్పు కన్పించడం లేదు’’ కామెంట్ చేశారు.
బిల్లులో ఏముంది?
- ఎన్నికైన ప్రతినిధులు.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తారు. వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పని చేయాలి.
- తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని, సీఎంలు లేదంటే మంత్రులు అరెస్ట్ అయి కస్టడీలో ఉంటే.. రాజ్యాంగ నైతికత, మంచి పాలనకు ఆటంకం ఏర్పడుతుంది. చివరికి ప్రజలకు రాజ్యాంగంపై ఉన్న నమ్మకం పోతుంది.
- తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు 30 రోజులు జైల్లో ఉంటే.. 31వ రోజు పదవి కోల్పోతారు.
- ఇది కన్విక్షన్ (దోషిగా తీర్పు) అవసరం లేకుండా.. కేవలం చార్జెస్, అరెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
- కస్టడీ నుంచి విడుదలయ్యాక సదరు నేత మళ్లీ అధికారం చేపట్టేందుకు అర్హుడవుతారు.
- ఆర్టికల్ 75, ఆర్టికల్ 164లో సవరణలు చేస్తారు. ఆర్టికల్ 75 అనేది ప్రధాని, కేంద్ర మంత్రులకు వర్తిస్తుంది. ఆర్టికల్ 164 అనేది సీఎంలు, రాష్ట్ర మంత్రులకు వర్తిస్తుంది.
- ఇప్పటి దాకా ఉన్న చట్టాల కంటే ఇది కఠినమైనది. ఎందుకంటే ఇప్పుడు కన్విక్షన్ తర్వాతే డిస్ క్వాలిఫికేషన్ ఉంది. తాజాగా కొత్త చట్టం అమల్లోకి వస్తే ఆరోపణలు ఎదుర్కొంటూ 30 రోజులు కస్టడీలో ఉన్నా.. పదవి పోతుంది.