మామిడి పండ్లు సరే.. పిల్లల గురించి పట్టించుకోరా?..ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

మామిడి పండ్లు సరే.. పిల్లల గురించి పట్టించుకోరా?..ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
  • మామిడి పండ్లు సరే.. పిల్లల గురించి పట్టించుకోరా?
  • ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ ఫైర్
  • సీబీఎస్‌‌‌‌ఈ క్లాస్ 12 ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానం టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి 
  • ఒకే ఒక కంపెనీ కోసం టెండర్ల నిబంధనల్లో మార్పు 
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే  రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు సమయం ఉంటుంది కానీ.. మొబైల్ ఫోన్ల స్కానింగ్ వల్ల భవిష్యత్తు అంధకారమైన 18.5 లక్షల మంది సీబీఎస్‌‌‌‌ఈ విద్యార్థుల గురించి మాట్లాడేందుకు టైం లేదా? అని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌గాంధీ ప్రశ్నించారు. సీబీఎస్‌‌‌‌ఈ క్లాస్ 12 ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌‌‌‌ఎం) విధానం టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రొఫెషనల్ స్కానర్లకు బదులు కేవలం మొబైల్ ఫోన్లతోనే విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేశారన్న సరికొత్త ఆధారాలను బహిర్గతం చేశారు. ఈ వివాదంపై పోరాడుతున్న బాధిత విద్యార్థులు, ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన స్కాలర్‌‌‌‌‌‌‌‌ సార్థక్ సిద్ధాంత్‌‌‌‌తో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.


ఒకే ఒక కంపెనీ కోసం టెండర్ల నిబంధనల మార్పు?

రాహుల్ గాంధీ తన పోస్టులో ప్రధానంగా ‘కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే ప్రైవేట్ వెండర్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ‘‘2025 మేలో సీబీఎస్‌‌‌‌ఈ విడుదల చేసిన టెండర్ నిబంధనల ప్రకారం.. విద్యార్థుల సమాధాన పత్రాలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా, కనీసం 300 డీపీఐ నాణ్యతతో ‘ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల’ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంది. కానీ, ఆగస్టులో మళ్లీ విడుదల చేసిన టెండర్‌‌‌‌లో ఈ నిబంధనలన్నింటినీ బోర్డు సైలెంట్‌‌‌‌గా తొలగించింది” అని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే సీబీఎస్‌‌‌‌ఈ ఈ నిబంధనలను సడలించిందని, ఈ అవినీతిలో బోర్డుకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.