మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం: ప్రధాని

మహిళలను లక్షాధికారులుగా  మార్చడమే లక్ష్యం: ప్రధాని

 

  • వికసిత్​ భారత్​ సంకల్స్ యాత్రలో ప్రధాని మోదీ
  • గత పదేండ్లలో 10 కోట్ల మంది మహిళా సంఘాల్లో చేరిక
  • వీడియో కాన్ఫరెన్స్​లో ఇంటరాక్ట్​

న్యూఢిల్లీ/భోపాల్: స్వయం సహాయక సంఘాల్లోని 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే తన కల అని ప్రధాని మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని తెలిపారు. వాళ్లకు బ్యాంకుల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు. ఈ సంఘాల్లోని 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే తన కల అని, అందుకోసం మహిళలందరూ సహకరించాలని కోరారు. ‘‘మేం తెచ్చిన సంక్షేమ పథకాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నిండాయి. అది నాకెంతో సంతృప్తిని ఇస్తోంది. లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. సంకల్ప్ యాత్రలో భాగంగా కోటి మందికి ఆయుష్మాన్ కార్డులు అందజేశామని పేర్కొన్నారు. ‘‘రూరల్ డెవలప్ మెంట్​కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అగ్రికల్చర్, షిషరీస్ సెక్టార్లను అభివృద్ధి చేస్తున్నాం” అని చెప్పారు. 

రుబీనాతో ఆసక్తికర సంభాషణ.. 

లబ్ధిదారులతో ఇంటరాక్షన్ సందర్భంగా రుబీనా ఖాన్ అనే మహిళతో మోదీ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ‘నీ గ్రూపులోని ఎంతమంది మహిళలను లక్షాధికారులను చేయాలని అనుకుంటున్నావు’ అని ప్రధాని అడగ్గా.. దేశంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలని అనుకుంటున్నానని రుబీనా జవాబిచ్చింది. ఈ సందర్భంగా తన జర్నీని ఆమె వివరించింది. ‘‘నేను స్వయం సహాయక సంఘంలో చేరాక రూ.5 వేల లోన్ తీసుకుని బట్టల బిజినెస్ మొదలుపెట్టాను. ఇంటి దగ్గర అమ్మడంతో పాటు నా భర్తతో బైక్ పై వెళ్లి అమ్మేదాన్ని. ఆ తర్వాత మారుతీ వ్యాన్ కొనుగోలు చేశాం. ఇప్పుడు దేవాస్ జిల్లాలో షాప్ పెట్టాం” అని చెప్పింది. కాగా, రుబీనా జర్నీ గురించి విని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు మారుతీ వ్యాన్ కొన్నావా.. కానీ నాకైతే సైకిల్ కూడా లేదు” అన్నారు. ఆమెలోని ఆత్మవిశ్వాసానికి ఎంతో మెచ్చుకున్నారు. ఇలాంటి మహిళలతోనే మన దేశం ఆత్మనిర్భర్ భారత్​గా అవతరిస్తుందని అన్నారు.