రైతులకు పీఎం కిసాన్ పైసలు రానిస్తలె..

రైతులకు పీఎం కిసాన్ పైసలు రానిస్తలె..
  • 4.41 లక్షల మంది రైతులకు అందని రూ.6వేల సాయం
  • వ్యవసాయ శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విజ్ఞప్తులు
  • సీఎం కేసీఆర్​కు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ లెటర్
  • రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేయాలని సూచన
  • అయినా స్పందించని రాష్ట్ర సర్కారు

రాష్ ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి) పైసలు అందడం లేదు. ఈ పథకం కింద లబ్ధి
పొందేందుకు రైతులు ఇచ్చిన అప్లికేషన్లను రాష్ ట్ర వ్యవసాయ శాఖ అప్రూవ్ చేయలేదు. కొందరి అప్లికేషన్లను రిజెక్ట్ చేయగా.. మరికొందరికి డబ్బులు జమ చేయడం మధ్యలోనే ఆపేసిం ది. దీంతో రాష్ట్రం లో 4.41 లక్షల మంది రైతులు ఏడాదికి రూ.6 వేల చొప్పున రూ.265 కోట్లు కోల్పోయారు. ఈ నేపథ్యం లో దీనిపై జోక్యం సుకోవాలని, అర్హులైన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆప్ డేట్ చేయాలని సీఎం కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తాజాగా లెటర్ రాశారు. అర్హుల జాబితాను ఎప్పటికప్పుడు గుర్తించి, అప్రూవ్ చేసి కేంద్రానికి పంపడం రాష్ర్ట ప్రభుత్వ బాధ్యత అని సూచించారు. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సొమ్ము జమ చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని, కేంద్రానికి సహకరించాలని కోరారు.

సహకరించాలని ఎన్ని సార్లు అడిగినా..

రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు విషయంలో టీఆర్ఎస్ సర్కారు ముందు నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కేంద్ర పథకాలతో రైతులు లబ్ధి పొందితే రాజకీయంగా తాము నష్టపోతామనే పీఎం కిసాన్ అందరికీ అందకుండా చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కీమ్ పక్కాగా అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రం పలుమార్లు రాష్ర్టానికి సూచించినా, కనీసం పట్టించుకోలేదు. జిల్లా, రాష్ర్టస్థాయిలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి రైతులందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ర్ట వ్యవసాయ శాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఒకటి, రెండు ఇన్​స్టాల్​మెంట్స్ వచ్చిన వారికి తర్వాత రావడం ఆగిపోయింది. ఏమైందని ఆన్​లైన్​లో చెక్ చేయిస్తే ‘పేమెంట్ స్టాప్​డ్ బై స్టేట్ గవర్నమెంట్’ అని చూపిస్తోంది. రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా వాళ్లు పట్టించుకోవడం లేదు. ‘మాకేం సంబంధం లేదు.. పైన ఓకే చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు వస్తయి’ అని చెప్తున్నారు.

ఎన్ని ఎకరాలున్నా అర్హులే

పీఎం కిసాన్ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం 2018 డిసెంబర్​లో ప్రారంభించింది. ఒక విడతకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటిదాకా ఆరు విడతల్లో డబ్బు జమ చేసింది. ఈ డిసెంబర్​లో ఏడో విడతలో రూ.2 వేల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ పథకం ప్రారంభంలో ఐదెకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులనే కేంద్రం అర్హులుగా ప్రకటించింది. అయితే ఎంత వ్యవసాయ భూమి ఉన్నా ఈ స్కీమ్ వర్తించేలా సవరణలు చేసింది. దీంతో లబ్ధిదారులు పెరిగారు. రాష్ర్టంలోని రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ రూపంలో రూ.3,259 కోట్లను కేంద్రం జమ చేసింది.

60 లక్షల మందిలో.. 36.86 లక్షల మందికే పైసలు

రైతుబంధు లెక్కల ప్రకారం రాష్ర్టంలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ కింద లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 36.86 లక్షలుగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్ ఉద్యోగులు తదితర ఉన్నత వర్గాలకు ఈ స్కీం వర్తించదు. వీళ్ల సంఖ్య 10 లక్షలు అనుకున్నా.. ఇంకా 10 లక్షల మందికి పైగా రైతులు పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధి పొందలేకపోతున్నారు. దీనిపై వ్యవసాయ శాఖకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవట్లేదు.

ఒక్కసారే వచ్చినయ్

ఒకసారి రూ.2 వేలు పడినయ్. మళ్ల రాలే. ఎందుకని సార్లను అడిగితే ‘స్టేట్ గవర్నమెంట్ ఆపేసింది’ అని చెబుతున్నరు. ఎందుకు ఆపేసిండ్రో చెప్తలేరు. ఇప్పటికి నాలుగైదు అప్లికేషన్లు పెట్టుకున్న.

– తోట రాజు, కంటత్మాకూర్, వరంగల్ రూరల్ జిల్లా

ఆపితే ఏమొస్తది

పైసలు మోడీ సార్ ఏస్తున్నరు. ఇక్కడ ఎందుకు ఆపేస్తున్నరో తెలుస్తలే. పైసలు ఆపితే ఏమొస్తది. యాడాదికి రూ.6 వేలు పొలం దున్నుడుకో, కూలీలకో అక్కరొస్తయి కదా. జర పైసలు ఒచ్చేటట్లు చూడున్రి.

– లక్ష్మీబాయి, గోండగామ్, సంగారెడ్డి జిల్లా

అప్లై చేసి 9 నెలలైంది

పీఎం మోడీ ఏడాదికి రూ.6 వేలు ఇస్తుండని తొమ్మిది నెలల కింద నేనే పోయి మీ సేవలో దరఖాస్తు చేసుకున్న. భూమి పాసు బుక్కులు, ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలన్నీ ఇచ్చిన. ఆఫీసర్లు ఓకే చేస్తే డబ్బులు అకౌంట్ల పడ్తయన్నరు. ఇంత వరకు ఒక్కసారి కూడా రాలె. అగ్రికల్చర్ ఆఫీసర్​కు చెప్పుకున్నా ఫాయిదా లేదు.

– మణికంఠ రెడ్డి, మోమిన్​పేట్,
వికారాబాద్ జిల్లా