ఇంటింటా రామ జ్యోతి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు

ఇంటింటా రామ జ్యోతి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు
  •     ఇంటింటా రామ జ్యోతి
  •     జనవరి 22న వెలిగించాలని
  •     దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
  •     రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన రోజు ‘దీపావళి’ జరుపుకోవాలని సూచన  
  •     అయోధ్యలో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్​ను ప్రారంభించిన పీఎం
  •     2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్​ప్రెస్​ ట్రెయిన్లు కూడా..

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నగరం అంతటా సందడి నెలకొంది. శనివారం అయోధ్య పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి రైల్వే స్టేషన్ వరకూ ఏడు కిలోమీటర్ల పొడవునా రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. 

నగరంలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ ట్రెయిన్లను కూడా ప్రారంభించారు. వేడుకల నేపథ్యంలో మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టును రికార్డ్ స్థాయిలో 20 నెలల్లోనే పూర్తి చేశారు. 

అయోధ్య ధామ్ స్టేషన్ ను కూడా సకల సౌలతులతో తీర్చిదిద్దారు. ఎయిర్ పోర్టును ప్రారంభించిన తర్వాత మోదీ మాట్లాడుతూ.. జనవరి 22న వేడుకలు జరిగే రోజు దేశంలోని ప్రతి ఇంటా ‘శ్రీరామ జ్యోతి’ని వెలిగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రాముడు ఒకప్పుడు టెంట్ కింద నివసించేవాడని, కానీ ఇప్పుడు ఆయనకూ పక్కా ఇల్లు సమకూరిందని మోదీ అన్నారు.

అయోధ్య(యూపీ):  ప్రపంచమంతా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల కోసం ఎదురు చూస్తోందని, అయోధ్య ప్రజలు మరింత ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 22న వేడుకలు జరిగే సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిలోనూ ‘శ్రీరామ జ్యోతి’ని వెలిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘దేశం కోసం మనం కొత్త తీర్మానం చేసుకోవాలి. మనలో మనం కొత్త శక్తిని నింపుకోవాలి.

 రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సంబురాలను దీపావళి పండుగలా ఘనంగా జరుపుకోవాలి” అని పిలుపునిచ్చారు. శనివారం అయోధ్యలో పర్యటించిన ప్రధాని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను, రీడెవలప్ చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ ట్రెయిన్లను జెండా ఊపి ఇనాగురేట్ చేశారు. వీటిలో కొన్నింటిని వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే రూ. 15,700 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

ఇందులో అయోధ్య సిటీ, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం రూ. 11,100 కోట్లతో చేపట్టిన పనులు, రూ. 4,600 కోట్లతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన పబ్లిక్ మీటింగ్​లో ప్రధాని మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి సాధించిందంటే.. అది తన వారసత్వాన్ని పరిరక్షించుకున్న దేశమే అయి ఉంటుందన్నారు. ప్రాచీన వారసత్వాన్ని వర్తమానంతో కలిపి ముందుకు వెళ్తున్నందుకే ఇండియా ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందన్నారు. అభివృద్ధి, వారసత్వ బలాలే దేశాన్ని 21వ శతాబ్దంలో ముందుకు తీసుకెళ్తాయని నొక్కి చెప్పారు.

రాముడికీ పక్కా ఇల్లు.. 

అయోధ్యలో రాముడు ఒకప్పుడు టెంట్ కింద నివసించేవాడని, కానీ ఇప్పుడు దేశంలో 4 కోట్ల మంది ప్రజల మాదిరిగా ఆయనకూ పక్కా ఇల్లు సమకూరిందని మోదీ చమత్కరించారు. జనవరి 22న అయోధ్యలో వేడుకలు కళ్లారా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, కానీ ఆ రోజున అయోధ్యకు రావడం అందరికీ సాధ్యం కాదన్నారు. ‘‘చేతులు జోడించి వేడుకుంటున్నా. జనవరి 22న వేడుకలకు ఆహ్వానం ఉన్నవాళ్లు మాత్రమే రండి. మిగతా వాళ్లు ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు” అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇకపై దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాలన్నింటి నుంచీ అయోధ్యకు రోజూ భక్తులు వస్తారని, ఇది 
అనంతంగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

రూ. 240 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి.. 

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో రీడెవలప్ చేసిన ఫేజ్–1 ప్రాజెక్టును రూ. 240 కోట్లతో పూర్తి చేశారు. మూడు అంతస్తులు ఉన్న స్టేషన్ బిల్డింగ్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, షాపులు, వెయిటింగ్ హాల్స్, చైల్డ్ కేర్ రూంల వంటి అన్ని సౌలతులు ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అయోధ్య–దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లో మొదటి జర్నీలో స్కూలు పిల్లలు, టీచర్లు సహా ప్రత్యేకంగా సావనీర్ పాస్ లు పొందిన 1200 మంది ప్రయాణించారు.

ఉజ్వల యోజన లబ్ధిదారు ఇంటికి పీఎం.. 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల జీవితాలను మార్చేసిందని మోదీ అన్నారు. ఉజ్వల యోజన కింద 10 కోట్లవ కనెక్షన్ పొందిన ఓ మహిళ ఇంటిని సందర్శించి, టీ తాగిన  సందర్భంగా ప్రధాని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇస్తే.. తమ ప్రభుత్వం మాత్రం పదేండ్లలోనే ఉజ్వల యోజన కింద 18 కోట్ల గ్యాస్ కనెక్షన్లను ఇచ్చిందన్నారు. ఇందులో 10 కోట్ల ఫ్రీ కనెక్షన్లు ఉన్నాయన్నారు.

జానపద నృత్యాలతో స్వాగతం

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ జానపద నృత్యాలతో స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా అయోధ్య పుర వీధులను దేశంలోని జానపద కళలను తెలిపేలా ప్రత్యేక రంగులతో అలంకరించారు. ఎయిర్​పోర్ట్​ నుంచి రైల్వే స్టేషన్​ వరకు సాగిన మోదీ రోడ్​షోలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ కళాకారుల బృందాలు ఆయనకు నృత్యాలతో స్వాగతం పలికాయి. రాజస్థాన్‌‌కు చెందిన ఒక మహిళా బృందం ‘చక్రి’ నృత్యాన్ని ప్రదర్శిస్తే, ప్రయాగ్‌‌రాజ్‌‌కు చెందిన మరో బృందం పురాతన జానపద నృత్య రూపమైన ‘దేధియా’ను ప్రదర్శించింది. 

అయోధ్య, లక్నోకు చెందిన మహిళా కళాకారులు ‘బధవా’ ప్రదర్శించగా, ఘజియాబాద్‌‌కు చెందిన కళాకారులు ‘ధోబియా’ నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికారు. యూపీలోని సుల్తాన్‌‌పూర్‌‌కు చెందిన బృందం అయోధ్య అందాలపై జానపద గీతాన్ని ప్రదర్శించగా, మధుర -బృందావన్‌‌కు చెందిన కళాకారులు ‘మయూర్’ నృత్యంతో ఆకట్టుకున్నారు. విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్‌‌ వరకు 40 వేదికలపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 1,400 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. 

అయోధ్య క్లీనెస్ట్ సిటీ కావాలె..

అయోధ్య నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దేశంలోనే అయోధ్య ను క్లీనెస్ట్ సిటీగా మార్చాలని స్థానిక ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఇది అయోధ్య నగర ప్రజల బాధ్యత అని అన్నారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ను పురస్కరించుకుని జనవరి 14 నుంచి 22 వరకూ దేశవ్యాప్తంగా అన్ని గుడుల్లోనూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

భారీ రోడ్ షో.. 

ముందుగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అయోధ్య ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి భారీ రోడ్ షో నిర్వహిస్తూ అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. మార్గమంతటా ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, కళాకారులు నృత్యాలు చేస్తూ ఆహ్వానం పలికారు. రైల్వే స్టేషన్​ను ప్రారంభించిన తర్వాత ప్రధాని స్టేషన్ అంతటా కలియదిరిగి చూశారు. స్టేషన్ విశేషాలను రైల్వే మంత్రి ఆయనకు వివరించారు. అనంతరం లతా మంగేష్కర్ చౌక్​ను ప్రధాని సందర్శించారు. అక్కడ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ కు గుర్తుగా ఏర్పాటు చేసిన భారీ వీణను మోదీ పరిశీలించారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు ఉన్నారు.