ప్రకృతి సాగుతో సన్నకారు రైతులకు మేలు

ప్రకృతి సాగుతో సన్నకారు రైతులకు మేలు

గత ఆరేడేళ్లలో రైతుల ఆదాయం పెంచేందుకు అనేక చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. భూసార పరీక్షలు, కొత్త రకం వంగడాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఒకటిన్నర రెట్లు మద్దతు ధర లాంటి చర్యలు తాము చేపట్టినట్టు చెప్పారు.వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాచీన విజ్ఞానాన్ని అనుసరించడం తప్పనిసరి అని మోడీ చెప్పారు. పకృతి సాగుతో దేశంలో 80 శాతం చిన్న, సన్నకారు రైతులు చాలా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఐదెకరాల లోపు పొలం మాత్రమే ఉన్న ఈ రైతులకు కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల చాలా ఖర్చువుతుందని, అదే సహజమైన ఎరువులను వాడితే చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అలాగే వ్యవసాయంలో చేసే చిన్న చిన్న పొరబాట్ల నుంచి బయటపడాలన్నారు. పంట పండిన తర్వాత వేస్ట్‌ను పొలంలో తగలబెట్టడం వల్ల భూసారం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారని, కానీ ఇదొక అలవాటుగా మారిపోయిందని మోడీ అన్నారు. భూసారాన్ని కాపాడుకునేందుకు ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

వ్యవసాయాన్ని కెమికల్ ల్యాబ్‌లకు దూరం చేసి, నేచురల్ ల్యాబ్‌తో అనుసంధానించి ముందుకు సాగాలని మోడీ సూచించారు. నేచురల్ ల్యాబ్ అంటే అది పూర్తిగా సైంటిఫిక్ బేస్డ్‌గా ఉంటూ విత్తనాలు మొదలు భూసారం వరకూ అన్ని రకాల సమస్యలకు ప్రకృతి పరంగా పరిష్కారాలు కనిపెట్టేలా ఉండాలని చెప్పారు. నేచురల్ ఫార్మింగ్‌పై జరుగుతున్న ఈ సదస్సులో దాదాపు 8 కోట్ల మంది రైతులు పాల్గొన్నారని, ఈ సదస్సు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్రకృతి సాగు లాంటివి వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు తోడ్పడుతాయని మోడీ చెప్పారు.

పంటలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ ఇచ్చే ల్యాబ్‌

భూమి నుంచి పండించిన ఉత్పత్తుల వరకూ టెస్టులు చేసిన ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌ సర్టిఫికెట్ ఇచ్చే ల్యాబ్‌ను స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు హోం మంత్రి అమిత్‌ షా. దీని ద్వారా రైతులు పండించిన పంటలకు మరింత మంచి రేటు వస్తుందని చెప్పారు. దీంతో ఆర్గానిక్ సాగు పట్ల రైతుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందన్నారు. రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్‌ వైపు అడుగులు వేయాలని 2019 నుంచి ప్రధాని మోడీ కోరుతూ వస్తున్నారని, రసాయన ఎరువులకు బదులు ఆవు పేడ లాంటివి వాడాలని చెప్పారు.