అయోధ్యలో రామ మందిర నిర్మాణం మన అదృష్టం: మోదీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణం మన అదృష్టం: మోదీ

విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరిపే ఈ వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. ఢిల్లీలోని ద్వారకలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బాణాన్ని ఎక్కుపెట్టి రావణుడి బొమ్మపైకి వదిలారు.

న్యూఢిల్లీ: చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రతి ఏడాది దసరా పండుగ జరుపుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏండ్ల నిరీక్షణ తర్వాత కల సాకారం అవుతున్నదని, ఇది తమ సహనానికి సంకేతమని తెలిపారు. ఈ అద్భుతమైన నిర్మాణం చూసేందుకు కూడా అదృష్టం ఉండాలన్నారు. ఢిల్లీ ద్వారకాలోని సెక్టార్ 10లో శ్రీ రామ్​లీలా సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం డీడీఏ గ్రౌండ్​లో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్​కు ప్రధాని మోదీ చీఫ్  గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహకులు ప్రధాని మోదీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. 

శాలువా, రామ్​దర్బార్ స్టాచ్యూతో పాటు గదతో సన్మానించారు. తర్వాత, వేదికపై నిర్వహించిన ప్రత్యేక పూజలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అన్నారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా దేశప్రజలకు మోదీ విజయ దశమి శుభాకాంక్షలు చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని తెలిపారు. 

ఎన్నో ఏండ్లుగా దీని కోసం ఎదురుచూశామని గుర్తు చేశారు. వచ్చే రామనవమి అయోధ్యలోని రామ్ లల్లా మందిరంలో నిర్వహిస్తామని, ఈ అద్భుతమైన ఘట్టాన్ని ప్రపంచమంతా చూస్తుందని తెలిపారు. రామ మందిర నిర్మాణం ప్రతి భారతీయుడి విజయానికి ప్రతీక అని తెలిపారు. తర్వాత బాణం ఎక్కుపెట్టి రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రావణ దహనంలో సుమారు 100 కేజీలో టపాకులు ఉపయోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులను మోహరించారు.