
న్యూఢిల్లీ: మణిపూర్ సంక్షోభం నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్మరోసారి విమర్శలు గుప్పించింది. మే నెలలో హింస చెలరేగినప్పటి నుంచి ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మంగళవారం మరోసారి మండిపడ్డారు. జోక్యం చేసుకొని, సహకారం అందించాల్సిన సమయంలో ప్రధాని ఆ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి మంగళవారానికి 175 రోజులు అయిందన్నారు. ప్రధాని మణిపూర్ ను ఎలా విస్మరిస్తున్నారో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. "సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించడం ద్వారా అతను జవాబుదారీతనం, బాధ్యత నుంచి తప్పించుకోలేరు" అని జైరాం రమేశ్ అన్నారు. ఆ స్టేట్లో అల్లర్లను నియంత్రించలేక పరువు పోగొట్టుకున్న సీఎం ఎన్ బీరెన్ సింగ్ను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని జైరాం రమేశ్ ప్రశ్నించారు.