
- అవినీతి సర్కార్ ను గద్దె దించుదాం
- ఒక్క ఫ్యామిలీ గుప్పిట్లోనే అధికారమా?: ప్రధాని
- తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు.. ప్రతి ప్రాజెక్టులో వాళ్ల స్వార్థమే
- అన్ని వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్నరు
- పేదల రేషన్ బియ్యాన్ని కూడా లూటీ చేస్తున్నరు
- అభివృద్ధి పనుల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలే
- దీని వల్ల మొత్తం తెలంగాణ ప్రజలు నష్టపోతున్నరు
- రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటన
- సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం
- రూ. 11 వేల కోట్లకుపైగా పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అవినీతి సర్కారును గద్దె దించేందుకు కలిసి రావాలని ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఒకే కుటుంబం గుప్పిట్లో అధికారం మగ్గిపోతున్నదని, ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఏ పని చేసినా ఒక్క కుటుంబం ప్రయోజనం కోసమే జరుగుతున్నాయని అన్నారు. అలాంటి వాళ్లతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని తెలిపారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్– తిరుపతి వందే భారత్ రైలులో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు’’ అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబం కబంధ హస్తాల్లో బందీ అయిపోయిందని అన్నారు. ఆ కుటుంబంలోని తండ్రి, కొడుకు, బిడ్డ ఇలా వాళ్ల చుట్టూ పరిపాలన సాగుతున్నదని, అవినీతి పేట్రేగుతున్నదని తెలిపారు. అలాంటి వారి వల్ల నిజాయతీపరులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. ‘‘అవినీతిపరులు తమ పొట్ట నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నరు. ప్రతి ప్రాజెక్టులో తమ లాభం, స్వార్థం చూసుకుంటున్నరు. అందరినీ, అన్ని వ్యవస్థలను తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నరు. అలాంటి వాళ్ల వల్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. అన్నివర్గాల వారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు” అని ఆయన తెలిపారు.
దోచుకుంటున్నరు.. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా అవినీతి, కుటుంబ పాలకులు దోచుకుంటున్నారని, ఇందులో తెలంగాణ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు.
తెలంగాణలోని లక్షలాది మంది పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నదని తెలిపారు. అవినీతిపరుల చేతికి సొమ్ము చిక్కకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్బెనిఫిట్ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా అన్ని వర్గాల ప్రజల ఖాతాల్లో ఆర్థిక సాయం అందజేస్తున్నదని వివరించారు. 2014కు ముందు దేశంలోనూ కుటుంబ పాలన సాగిందని, ఆ బంధనాలను తెంచుకున్న తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కూడా కుటుంబ, అవినీతి పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, అవినీతి సర్కారును గద్దెదించుదామని ఆయన పిలుపునిచ్చారు.
అవినీతి పరులు ఒక్కటవుతున్నరు..
‘‘అవినీతి పరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా? అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా?’’ అంటూ ప్రజలను ప్రధాని మోడీ అడిగారు. అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా చెప్పాలని కోరారు. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీని ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘నిజాయితీగా పనిచేసే వాళ్లంటే అవినీతిపరులకు వణుకు. అవినీతి పరులంతా ఒక్కటవుతున్నరు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు తమ చిట్టా బయటకు వస్తుందనే భయంతో కోర్టుకు పోయాయి. అవినీతికి రక్షణ కల్పించాలని అడిగితే కోర్టు వారికి షాక్ ఇచ్చింది” అని తెలిపారు.
ప్రధానికి గ్రాండ్ వెల్కం
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శనివారం ఉదయం 11.30కు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాని చేరుకున్నారు. స్టేషన్లోకి వెళ్లే ముందు చిలకలగూడ సర్కిల్ దగ్గర ప్రధానికి అభిమానులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని నేరుగా వందే భారత్ ట్రైన్‌లోకి వెళ్లి నల్గొండ వెళ్తున్న స్టూడెంట్స్, ట్రైన్ లోకో పైలెట్‌తో మాట్లాడారు. తర్వాత జెండా ఊపి రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో అనీల్ కుమార్ లహోటి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ఆధునీకరణ, బీబీ నగర్ ఎయిమ్స్‌లో అదనపు భవన నిర్మాణాలు, నేషనల్ హైవేలు, ఇతర పనులకు మోడీ శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పనుల్లో జాప్యం
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర సర్కారు తీరు వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, దీంతో మొత్తం తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో నేషనల్ హైవేస్ విస్తరణ చేపట్టామన్నారు. శనివారం ఒక్కరోజే రూ.11 వేల కోట్లకు పైగా విలువైన పనులు చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తున్నామన్నారు. 70 కిలోమీటర్ల మేర మెట్రో పనులకు నిధులిచ్చామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా టాయిలెట్లు, 11 లక్షల మందికి పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. సమావేశంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
రాబోయే రోజులు తెలంగాణకు అత్యంత కీలకమైనవని ప్రధాని మోడీ అన్నారు. తమకు మద్దతునిస్తే ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయం, పరిశ్రమలకు కేంద్రం తోడ్పాటునిస్తున్నదని తెలిపారు. దేశంలో ఏడు టెక్స్టైల్పార్క్లు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒక మెగా టెక్స్టైల్ పార్క్తెలంగాణకు ఇచ్చామని, దీంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు. బీబీ నగర్ఎయిమ్స్లో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌ను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయమున్న హైదరాబాద్‌నుంచి వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతికి వందే భారత్రైలు ప్రారంభించుకున్నామని తెలిపారు. రూ.7 వేల కోట్లతో కొత్తగా నేషనల్హైవేలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. సికింద్రాబాద్– మహబూబ్నగర్డబ్లింగ్ తో బెంగళూరుకు రైల్కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు. తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈజ్ ఆఫ్ ట్రావెల్..ఈజ్ఆఫ్లివింగ్.. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు దోహదం చేస్తాయని మోడీ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం తనకు దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.