
- టాలెంట్ ఉన్నా.. వారికి చాన్స్ఇవ్వడం లేదు: మోదీ
- ఎన్డీయే సభ్యుల మీటింగ్‌లో ప్రధాని కామెంట్స్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ప్రతిభ ఉన్న యువ నాయకులు చాలా మంది ఉన్నారని.. కానీ, ఓ కుటుంబ అభద్రతాభావం కారణంగా వారికి మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాకుండా, ఆ యువ నాయకుల ఉనికి రాహుల్ గాంధీని అభద్రతాభావానికి, ఆందోళనకు గురిచేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఎన్డీయే నాయకులతో జరిగిన టీ మీటింగ్‌లో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకులెవరూ హాజరు కాలేదు.
ఇది కేవలం పాలక కూటమి నాయకులకు మాత్రమే పరిమితమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాలు విజయవంతమయ్యాయని, ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బిల్లు దీర్ఘకాలిక ప్రభావం చూపే సంస్కరణ అని, దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లు ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ముఖ్యమైన బిల్లులపై చర్చలకు దూరంగా ఉంటూ, కేవలం అడ్డంకులు సృష్టించడంలోనే నిమగ్నమయ్యాయని ప్రధాని మోదీ విమర్శించినట్టు సమాచారం. ఈ నెల 20న పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు– 2025 పాస్ అయిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, ఉల్లంఘనల్లో పాల్గొన్న వ్యక్తులపై కఠిన నిబంధనలు, శిక్షలను విధిస్తుంది.