పెట్రో ధరలపై పీఎం, ఫైనాన్స్​ మినిస్టర్ మీటింగ్​

పెట్రో ధరలపై పీఎం, ఫైనాన్స్​ మినిస్టర్ మీటింగ్​

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడాయిల్​ బ్యారెల్ ఏకంగా 100 డాలర్లు దాటడంతో కేంద్ర ప్రభుత్వం అలెర్టయింది. ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్న రష్యా భారీగా చమురును ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. దీనిపై మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆయిల్​ రేట్లు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుత ధరలు ఏడేళ్ల హైకి చేరుకున్నాయి. దీంతో చమురు ధరలపై చర్చించడానికి ప్రైమ్​ మినిస్టర్​ నరేంద్ర మోడీ​ గురువారం సమావేశమవుతానని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్ తెలిపారు. యుద్ధం, చమురు ధరల పెరుగుదల వల్ల ఏర్పడే సమస్యలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారని తెలుస్తోంది. ధరలను అదుపు చేయడానికి పెట్రో ప్రొడక్టులపై విధిస్తున్న ఎక్సైజ్​ డ్యూటీ ఏ మేరకు తగ్గించవచ్చో పరిశీలించాలని పీఎం ఆఫీసు ఫైనాన్స్​ మినిస్ట్రీకి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఫైనాన్స్​ మినిస్ట్రీ పన్నుల తగ్గింపుపై కసరత్తు మొదలుపెట్టిందని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు. చమురు ధరల పెరుగుదల మనకు కచ్చితంగా సవాలేనని మంత్రి నిర్మల బుధవారమే మీడియాతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా గత ఏడాది నవంబరులో డీజిల్​పై రూ.10, పెట్రోలుపై రూ.ఐదు చొప్పున ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించింది. ఈ తరువాత నుంచి ధరల్లో ఎటువంటి మార్పులూ కనిపించడం లేదు. అప్పటికే ధరలు ఎక్కువ కావడంతో ఎక్సైజ్​ డ్యూటీలో కోత పెట్టారు. ఈ నిర్ణయం తరువాత కూడా చమురు ధరలు మరింత పెరిగి ఇప్పుడు తారస్థాయికి చేరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. అయితే యుద్ధం మరింత పెరిగినప్పటికీ, ఇండియాకు చమురు సప్లైకి మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని ఆయిల్​ మినిస్ట్రీకి చెందిన సీనియర్ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. యుద్ధం కారణంగా సప్లై లైన్లు ఏవీ దెబ్బతినలేదని, మార్కెట్లో తగినంత సప్లై ఉందని చెప్పారు. మనకు మిడిల్​ ఈస్ట్, ఆఫ్రికా, నార్త్​ అమెరికా నుంచి క్రూడాయిల్​ వస్తుందని, ఆ ప్రాంతాలన్నీ సేఫ్​గానే ఉన్నాయని ఆయన వివరించారు.