‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ జీ7 మీట్‌లో ప్రధాని మోడీ

‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ జీ7 మీట్‌లో ప్రధాని మోడీ

భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొవాలంటే ప్రపంచదేశాలన్ని ఐక్యంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. అందుకోసం వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో ముందుకుపోవాలని ఆయన అన్నారు. శనివారం జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పైవ్యాఖ్యలు చేశారు. మోడీ వ్యాఖ్యలకు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ బలమైన మద్దతునిచ్చారు. ఈ సెషన్‌లో ‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ - హెల్త్’ పేరుతో కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని పునరుద్ధరించడం మరియు భవిష్యత్తులో ఈ మహమ్మారికి ఎదుర్కోవడంపై చర్చించారు. 

భారత్‌లో కరోనా విజృంభిస్తోన్న వేళ ఇతర దేశాలు అందించిన మద్దతును ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రభుత్వం మరియు పౌర సమాజంలోని ప్రతి ఒక్కరిని సమన్వయం చేయడం ద్వారా కరోనాను కంట్రోల్ చేయగలిగామని మోడీ జీ7 మీట్‌లో చెప్పారు. కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు టీకా నిర్వహణ కోసం భారతదేశం ఓపెన్-సోర్స్ డిజిటల్ సాధనాలను విజయవంతంగా ఉపయోగించడాన్ని కూడా మోడీ ఇతర దేశాల ప్రతినిధులకు వివరించారు. కరోనా సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలపై విధిస్తున్న పన్నుల మాఫీ కోసం భారతదేశం పెట్టిన ప్రతిపాదనకు జీ7 దేశాలు మద్దతివ్వాలని మోడీ కోరారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ గతంలోనే తనతో చర్చించారని మోడీ అన్నారు.

నేటి సమావేశం ప్రపంచానికి ‘వన్ ఎర్త్ వన్ హెల్త్’ సందేశాన్ని పంపాలని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రపంచ దేశాల ఐక్యత, నాయకత్వం మరియు సంఘీభావం కోసం పిలుపునిచ్చారు. ఈ రోజు జరిగే జీ7 సదస్సులో మోడీ రెండు సెషన్లలో ప్రసంగించనున్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ వంటి వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ఆయా దేశాలు ముడిసరుకును సరఫరా చేయాలని పిలుపునిచ్చారు.