
- ఈ విషయాన్ని నెహ్రూ స్వయంగా అంగీకరించారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సింధూ జలాల ఒప్పందం భారత్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని మాజీ ప్రధాని నెహ్రూ కూడా అంగీకరించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకమనేందుకు నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) పార్లమెంటరీ మీటింగ్‌లో మోదీ మాట్లాడారు.
దేశాన్ని జవహర్‌లాల్ నెహ్రూ రెండు సార్లు విభజించారని చెప్పారు. ‘‘భారత్‌ను నెహ్రూ ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించారు. సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి డివైడ్ చేశారు. దీంతో దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. సింధూ నది ఒప్పందం వల్ల 80 శాతం నీరు పాకిస్తాన్‌కే వెళ్లిపోయింది. ఈ విషయాన్ని నెహ్రూనే స్వయంగా అంగీకరించారు” అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ సవరణతో హక్కులు కాలరాశారు
నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేసి..వాక్‌స్వాతంత్ర్యపు హక్కును కాలరాశారని ప్రధాని మోదీ అన్నారు. 42వ రాజ్యాంగ సవరణ చేసి నియోజకవర్గాల సంఖ్య పెంచారని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ కృషి చేయలేదని చెప్పారు. తమ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్నదని తెలిపారు. నెహ్రూ పార్లమెంట్ అప్రూవల్లేకుండానే ఒంటరిగా వెళ్లి సింధూ నదీ జలాల ఒప్పందం చేసుకొని వచ్చారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్‌కు రూ. 80 కోట్లు ఇచ్చిందని మరో ఎంపీ రవిశంకర్ విమర్శించారు.