
- భూమిపై వారికిసేఫ్ప్లేస్ అనేదే లేదన్న మోదీ
- బిహార్ గడ్డ పైనుంచే ఆపరేషన్ సిందూర్ సంకల్పం
- ఆ విజయాన్నిప్రపంచం మొత్తం చూస్తున్నది
- బిహార్‌లో పలు అభివృద్ధిప్రాజెక్టుల శంకుస్థాపనలో ప్రధాని
పాట్న/ కోల్‌కతా: బిహార్ గడ్డ పైనుంచే తాను ఆపరేషన్ సిందూర్ సంకల్పం తీసుకున్నా అని, దాని విజయాన్ని ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఇండియాకు హాని తలపెట్టాలని చూసే ఏ శత్రువునూ వదలబోమని హెచ్చరించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా తన దృఢమైన వైఖరిని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతీయుల రక్తాన్ని కండ్ల జూసే వారికి భూమిపై సురక్షితమైన స్థానం లేదని హెచ్చరించారు.
ఇదే న్యూ ఇండియా సిద్ధాంతమని స్పష్టం చేశారు. బిహార్‌లో రూ.7,200 కోట్ల విలువైన డెవలప్మెంట్ ప్రాజెక్టులకు మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనికి ముందు సివాన్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు.
ఆపై చంపారణ్ జిల్లా మోతీహారీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. అందుకే టెర్రరిస్టులను అంతం చేయడంలో విజయం సాధించాం. నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. 2014 లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో 125 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడవి 18కి తగ్గాయి’’అని మోదీ అన్నారు.
గత ప్రభుత్వాల పాలనలో పేదల బతుకులు మారలే
హార్ డెవలప్మెంట్ జర్నీలో శుక్రవారం.. ఓ చారిత్రక రోజు అని మోదీ అన్నారు. ‘‘రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. వాటర్, రైల్వే, పవర్ సెక్టార్లో కనెక్టివిటీ పెంచుతున్నాం. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయి. రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి సాధిస్తుంది. గడిచిన 11 ఏండ్లలో పీఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చాం. వీటిలో బిహార్‌లోనే 60 లక్షల ఇండ్లు ఉన్నాయి. అందులోనూ మోతీహారి జిల్లాలో 3 లక్షల మంది పేదలకు సొంతింటి కల నిజం చేశాం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. వికసిత్ భారత్‌లో.. బిహార్ కీలక పాత్ర పోషిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో పేదల బతుకులు మారలేదు. పేదల ఆత్మగౌరవం గురించి నాకు తెలుసు’’ అని మోదీ అన్నారు. బిహార్‌లో 3.5 కోట్ల మందికి పైగా మహిళలకు బ్యాంకు అకౌంట్లు కల్పించామని, గత ఒకటిన్నరేండ్లలో రాష్ట్రంలోని 24,000కు పైగా డ్వాక్రా గ్రూపులకు వెయ్యి కోట్ల సాయం అందించామని చెప్పారు. బలహీన వర్గాల పేరిట కాంగ్రెస్, ఆర్జేడీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. యూపీఏ పాలనలో బిహార్‌పై ప్రతీకార రాజకీయాలు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
బెంగాల్లో ఆడ బిడ్డల హత్యలు బాధాకరం
బెంగాల్లో మహిళలకు రక్షణలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని తృణమూల్ పార్టీ రక్షిస్తోందని ఆరోపించారు. బెంగాల్ దుర్గాపూర్‌లో రూ.5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ శుక్రవారం ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, క్లీన్ ఎనర్జీని పెంచే లక్ష్యంతో చమురు, గ్యాస్, విద్యుత్, రైల్, రోడ్డు ప్రాజెక్టులను ఆయన లాంచ్ చేశారు.
అనంతరం దుర్గాపూర్‌లోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో 31 ఏండ్ల జూనియర్ డాక్టర్‌ను అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. బెంగాల్ ఆడ బిడ్డలపై జరుగుతున్న దారుణాలను చూస్తుంటే బాధతో పాటు కోపం వస్తోంది.
ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో టీఎంసీ ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించింది. సౌత్ కోల్‌కతాలోని లా కాలేజీలో యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. ఆడ బిడ్డలకు బెంగాల్ సేఫ్ కాదు’’ అని మోదీ అన్నారు. కాగా, మా, మాటీ, మానుష్ (తల్లి, భూమి, మానవులు) గురించి మాట్లాడే పార్టీ (టీఎంసీ) హయాంలోనే మహిళలను రేప్ చేసి చంపేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.