ఢిల్లీలో జరిగిన వేడుకల్లో పంచెకట్టులో కనిపించిన మోదీ..

ఢిల్లీలో జరిగిన వేడుకల్లో పంచెకట్టులో కనిపించిన మోదీ..

సంక్రాంతి పండుగ.. ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి, పొంగల్​ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పంచెకట్టులో మోదీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటి మీనా తదితరులు పాల్గొన్నారు.

చెన్నై/ఢిల్లీ: సంక్రాంతి పండుగ.. ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ – తమిళ్, సౌరాష్ట్ర – తమిళ్ సంగమంలో కూడా ఇలాంటి భావోద్వేగ అనుబంధాలు చూడొచ్చని చెప్పారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అధికారిక నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పంచె కట్టులో మోదీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం వండారు. అనంతరం గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లోనూ పండుగ సందడి నెలకొన్నదన్నారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు. దేశంలోని ప్రతి మూల సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారని తెలిపారు.

పండుగలు.. దేశంలోని ప్రతి ఒక్కరి మధ్య అనుబంధం, అప్యాయత, అనురాగాలు పెంచుతుందని చెప్పారు. ఇదే.. దేశాన్ని మరింత దృఢంగా తయారు చేస్తుందని వివరించారు. సరికొత్త భారత్ వికసితం అవుతుందన్నారు. సంక్రాంతి పండుగను.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారని వివరించారు. దేశమంతా లోహ్రి పండుగను జరుపుకుందని, ఇప్పుడు మకర సంక్రాంతి వచ్చిందన్నారు. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎర్ర కోట వేదికగా ప్రకటించిన పంచ ప్రాణ్​లో దేశ ఐక్యత ఒకటని, దీన్ని మరింత శక్తిమంతం చేయాలని కోరారు. సంత్ కవి తిరువళ్లువర్ సూక్తులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.

దేశ నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయితీగల వ్యాపారుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పొంగల్ సందర్భంగా.. ప్రతి రైతూ.. తాను పండించిన పంటను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారని వివరించారు. దేశంలోని ప్రతి పండుగకు గ్రామాలు, రైతులతో సంబంధం ఉంటుందన్నారు. మిల్లెట్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. సూపర్ ఫుడ్ శ్రీ అన్న (మిల్లెట్లు) పై అవగాహన కల్పించాలని కోరారు. కొంత మంది యువకులు మిల్లెట్లపై స్టార్టప్ వెంచర్లు ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో మూడు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా, తన ఇంటి ఆవరణలో ఉన్న పుంగనూరు ఆవులతో ప్రధాని మోదీ సరదాగా గడిపారు. వాటికి స్వయంగా దాణా తినిపించారు. కుర్చీలో కూర్చొని వాటిని హత్తుకుంటూ మేత అందించారు.