
- షాహీన్ బాగ్ దాదీ బిల్కిస్, ఆయుష్మాన్ ఖురానాకు చోటు
న్యూఢిల్లీ: టైమ్స్ ‘‘మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2020’’ లిస్టులో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి చోటు దక్కించుకున్నారు. సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్టు(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో చేసిన నిరసనల్లో కీలక పాత్ర పోషించిన దాదీ బిల్కిస్ కూడా లిస్టులో చోటు సంపాదించుకున్నారు. వీరితో పాటు యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హ్యారీస్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా తదితరులు టైమ్స్ లిస్టులో ఉన్నారు. టైమ్ మేగజైన్ ప్రతిఏటా మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ పేరుతో వివిధ కేటగిరీల్లో 100 మంది లిస్టును విడుదల చేస్తుంది. ఆ ఏడాది ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులను అందులో చేరుస్తుంది. మోడీ 2017లోనూ టైమ్స్ లిస్టులో చోటు సంపాదించుకున్నారు. 82 ఏండ్ల దాదీ బిల్కిస్ ఈసారి జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
అణగారిన వర్గాల గొంతుక బిల్కిస్
సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్ లో 100 రోజుల పాటు ఆందోళన చేశారు. మహిళలే ఎక్కువ మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దాదీ బిల్కిస్ వారందరినీ ముందుండి నడిపించారు. చలిని సైతం లెక్క చేయని బామ్మ.. ఉదయం 8గంటల నుంచి అర్ధరాత్రి వరకూ వారితో ఉన్నారు. ‘‘ఒక చేతిలో జపమాల, మరో చేతిలో జాతీయ జెండాను పట్టుకొని నిరసనలో పాల్గొన్న బిల్కిస్… దేశంలోని అణగారిన వర్గాల గొంతుగా మారారు” అని ఆమెపై ఫీచర్ రాసిన జర్నలిస్టు రానా అయూబ్ పేర్కొన్నారు. ‘‘కేవలం ముస్లింలు మాత్రమే నిరసన తెలపడం లేదు. మేం ఆందోళన చేస్తున్న దగ్గర చూడండి. ఎంతోమంది ఫుడ్, అరటిపండ్లు, బిస్కెట్లు, జ్యూసులు పంపిణీ చేస్తున్నారు. వారిలో అన్ని మతాలవారున్నారు” అని సీఏఏకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం టైమ్ లో బిల్కిస్ పేర్కొన్నారు.