హెలికాప్టర్‌‌ ప్రమాదంపై మాట్లాడిన ప్రధాని మోడీ

హెలికాప్టర్‌‌ ప్రమాదంపై మాట్లాడిన ప్రధాని మోడీ

యూపీలోని బలరాంపూర్‌‌లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. 1978లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణం.. నిధుల కేటాయింపులు లేకపోవడం వల్ల నత్తనడకన సాగింది. 2016లో ప్రధాన్‌ మంత్రి కృషి సించాయీ స్కీమ్‌ కిందకు ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులు పెంచడంతో పనులు వేగంగా జరిగి, ఇటీవలే పనులు పూర్తయ్యాయి. దాదాపు 35 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టు సాకారం కావడంతో 29 లక్షల మంది రైతుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. అయితే గతంలో అధికారంలో ఉన్న పార్టీల ‘మైండ్‌సెట్‌’ కారణంగా దేశంలో కీలకమైన ప్రాజెక్టులన్నీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోయాయంటూ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నానాజీ దేశ్ ముఖ్, అటల్ బిహారీ వాజ్ పేయిల రూపంలో బలరాంపూర్ దేశానికి ఇద్దరు భారతరత్నాలను ఇచ్చిందన్నారు మోడీ.

జీవితమంతా యోధుడిగానే..

భారత తొలి సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)ను అర్ధంతరంగా కోల్పోవడం యావత్ దేశంలోని ప్రతి దేశభక్తుడికీ తీరని లోటని ప్రధాని మోడీ అన్నారు. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర సైనికులందరికీ ఆయన సంతాపం తెలిపారు. బిపిన్ రావత్ ఎంతో ధీశాలి అని, మన దేశ సైనిక బలగాలు స్వావలంబనతో ముందుకు సాగేలా చేయడానికి ఆయన ఎంతో శ్రమించారని అన్నారు. ఒక సైనికుడు కేవలం సైన్యం ఉన్నప్పుడు మాత్రమే కాదు.. జీవితాంత యోధుడేనని చెప్పారు. దేశ గౌరవం కోసం బిపిన్ తన జీవితాన్ని అంకితం చేశారని మోడీ అన్నారు. ఈ యోధులను కోల్పోయిన విషాదం ఉన్న భారత్ తన అభివృద్ధి ప్రయాణాన్ని ఆపబోదని, భారతీయులంతా ఐక్యంగా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని ముందుకు సాగుతామని చెప్పారు. ఏ లోకంలో ఉన్నా సరే బిపిన్ రావత్.. మన దేశం ప్రగతి పరుగులు పెట్టడాన్ని చూసి సంతోషిస్తారని మోడీ అన్నారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ను బతికించేందుకు డాక్టర్లు శ్రమిస్తున్నారని చెప్పారు. ఆయన కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.